తెలంగాణలో భానుడు ఉగ్రరూపం.. ఆదిలాబాద్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత !!
తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రతతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది

భానుడు ప్రతాపం..
ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని జనం హడలిపోతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో రికార్డు స్థాయిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందనట్లు హైదారబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కౌటలలో 43.7. డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీలు , జైనాథ్ లో 43.8 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వడగాల్పుల తీవ్రత
ఉత్తర వాయువ్యం నుంచి వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న వారం రోజుల్లో భానుడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ లో 44 నుంచి 46 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే ఉదయం 10 నుంచే ఎంత్ర తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సొంత పనుల మీద బయటకు వెళ్లాలన్న ప్రజలు జంకుతున్నారు. ఎండ తీవ్రతతో వారు తమ పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఈ ఎండలకు భయటకు వెళ్లలేము బాబోయ్ అంటున్నారు. దీంతో ప్రధాన రహదారుల్ని బోసిపోతున్నాయి.

వైద్యుల సూచనలు..
విదర్భ నుంచి కేరళ వరకు వీస్తున్న వేడిగాలులే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత వల్ల డిహైడ్రేషన్ బారినపడే సూచనలు ఉన్నాయని తెలిపారు. బయలకు వెళ్లాల్సివస్తే.. పల్చటి దుస్తులు, గొడుగును వినియోగించాలని వెల్లడించారు. శీత పానియాల కంటే .. నిమ్మరసంతో కూడిని నీళ్లు, లేదా.. మజ్జిగ, గ్లూకోజ్ తో కూడిన ద్రవం సేవించాలని వైద్యులు సూచించారు.