తెలుగురాష్ట్రాల్లో రేపు మోస్తరు వర్షం..?, చలిగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి..
అసలే చలికాలం. చలి పీక్కి చేరింది. ఎముకలు కొరికే చలిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తర ఒడిశా.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో హైదరాబాద్లో కొన్నిచోట్ల వర్షం కురిసింది. గురువారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజారావు పేర్కొన్నారు.
గురువారమే కాకుండా శుక్రవారం కూడా ఏపీ, తెలంగాణలో వర్షం కురుస్తోందని తెలిపారు. ఉపరితల ఆవర్తనంతో తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బు పట్టి.. చలి మరింత ఎక్కువైపోయింది. చలితో బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లడం లేదు.
బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లో కొన్నిచోట్ల వర్షం కురిసింది. తేలికపాటి జల్లులకే తడిసిముద్దయ్యే నగరం.. చలికాలంలో కురిసిన వర్షంతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే వర్షం పడటంతో ఎగ్జిబిషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. వర్షపునీటితో దుకాణాదారులు ఇబ్బంది పడుతున్నారు.