• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మమత వర్సెస్ కేసీఆర్: ఆ సమావేశానికి గులాబీ బాస్‌కు నో ఇన్విటేషన్.. నమ్మకం కోల్పోయారా..?

|

హైదరాబాదు:తెలంగాణలో ఒకప్పుడు పోరు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో క్రమంగా కనుమరుగవుతుండటంతో మరో జాతీయ పార్టీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోంది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక విజయం, గ్రేటర్‌ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు రావడంతో కమలనాథులు ఫుల్ జోష్‌తో ఉన్నారు.

ఇక గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్నన్ని స్థానాలు దక్కకపోవడంతో టీఆర్ఎస్‌లో కూడా కాస్త ధీమా తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన పరోక్షంగా తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానంటూ చిన్న హింట్ వదిలారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి..?

 ఫెడరల్ ఫ్రంట్ ముచ్చట ఏమైంది..?

ఫెడరల్ ఫ్రంట్ ముచ్చట ఏమైంది..?

తెలంగాణలో క్రమంగా బీజేపీ దూసుకొస్తుండటంతో సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. రెండేళ్ల క్రితం కొత్త రాజకీయ శక్తి ఫెడరల్ ఫ్రంట్ కోసం శ్రమించిన సీఎం కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సొంతం చేసుకోవడంతో ఆ ఐడియాను పక్కనపెట్టారు. తాజాగా సొంత రాష్ట్రంలోకి బీజేపీ దూసుకొస్తున్న నేపథ్యంలో కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక్క వేదికపైకి తీసుకొచ్చి హైదరాబాదులో సమావేశం నిర్వహించాలని భావించారు. అలా చేస్తానంటూ పరోక్షంగా కూడా చెప్పారు.

డిసెంబర్ రెండో వారంలో ఈ భేటీ ఉంటుందని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, రైతు చట్టాలపై చర్చిస్తామని చెప్పారు. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎయిరిండియా, బొగ్గు గనులు వంటివి ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రభుత్వంపై ఒక యుద్ధమే ప్రకటించారు గులాబీ బాస్.

గ్రేటర్ ఫలితాలతో సీఎం కేసీఆర్ మెత్తబడ్డారా..?

ఇక గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఊహించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చకపోవడంతో సీఎం కేసీఆర్ కాస్త మెత్తబడ్డారు. వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి స్నేహపూర్వకమైన వాతావరణంలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఆ సమయంలో రైతు సమస్యలను ప్రస్తావించలేదని సమాచారం . ఇక ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సీఎం కేసీఆర్... బీజేపీ వ్యతిరేక శక్తులతో హైదరాబాదులో ఓ సమావేశం నిర్వహిస్తామన్న మాటను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇతర ప్రాంతీయ పార్టీలను సమావేశపరుద్దామన్న ఆలోచన కూడా గులాబీ దళపతి చేయలేదు.

ఇక పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మోడీ, అమిత్ షా లాంటి వారు నిప్పులు చెరుగుతుంటే ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతకు అండగా నిలిచారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం మద్దతుగా నిలవలేదు. ఇదే విషయాన్ని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ట్వీట్ చేశారు.

 మమతా బెనర్జీ కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదు..?

మమతా బెనర్జీ కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదు..?

బెంగాల్‌లో ఐపీఎస్ బదిలీల అంశంలో మమతకు అండగా నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేష్ భగల్, అశోక్ గెహ్లాట్‌లకు మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలిపారని ఫెడరల్ ఫ్రంట్ చీఫ్ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో ఎందుకు లేరని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడ్డారేమో అందుకే ఢిల్లీ వెళ్లి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎందుకు ఉన్నఫలంగా స్టాండ్ మార్చుకుంటున్నారని ప్రశ్నించారు.ఇదిలా ఉంటే త్వరలోనే మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులతో కోల్‌కతాలో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదని సమాచారం. అయితే సీఎం కేసీఆర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో కూడా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. మమతతో పాటు, శరద్ పవార్, స్టాలిన్, నవీన్ పట్నాయక్‌లు కేసీఆర్‌ను నమ్మడం లేదని చెప్పారు. అదే సమయంలో బీజేపీ మరియు టీఆర్ఎస్‌లు రెండు రహస్య ఒప్పందంపై పయనిస్తూ ప్రజలను పిచ్చివారిని చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి.

మొత్తానికి సీఎం కేసీఆర్ ఆలోచనా విధానం ఎలా ఉందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ, అమిత్ షాలపై విమర్శనాస్త్రాలు సంధించిన గులాబీ బాస్... ఆ తర్వాత అదే అమిత్ షాకు ఢిల్లీ వెళ్లి శాలువా కప్పిరావడాన్ని టీఆర్ఎస్ క్యాడర్ జీర్ణించుకోలేకుంది. ఇక వీటన్నిటినీ విశ్లేషిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణలో రాజకీయంగా పెనుమార్పులు జరుగుతాయంటూ అభిప్రాయపడుతున్నారు.

English summary
Telangana CM KCR who earlier thought of a meeting with the anti-BJP leaders now seems to have changed his mind after meeting PM Modi in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X