
‘ఆచార్య’ ఫ్లాప్ వెనక బడా నిర్మాత?..ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ఫ్లాప్ వెనక ఓ బడా నిర్మాత ఉన్నారా...? ఆచార్య డిజాస్టర్ అయ్యేందుకు తెరవెనుక ఆ నిర్మాత ప్రయత్నాలు చేశారా అంటే అవుననే సమాధానం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వాలని ఆ బడా నిర్మాత ఎందుకు కోరుకున్నారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆచార్య పై నెగిటివ్ టాక్ వెనక...
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఆచార్య చిత్రం ఘోరపరాజయాన్ని మూటకట్టుకుంది. మెగా అభిమానులంతా ఈ చిత్రంతో నిరాశ చెందారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే దీనిపై నెగెటివ్ టాక్ తీసుకొచ్చేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఒక బడా నిర్మాత రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఆచార్య' దర్శకుడు కొరటాల శివతో ఆ నిర్మాతకున్న విభేదాలే దీనికి కారణమని ఫిల్మ్ నగర్ వర్గాలంటున్నాయి.

బడా నిర్మాతతో కొరటాల విబేధాలు
గతంలో కొరటాల దర్శకత్వం వహించిన ఓ చిత్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఆ నిర్మాతకు తేడా వచ్చింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆచార్య చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఆ నిర్మాతకు రాలేదు. వేరే వ్యక్తి దక్కించుకున్నారు. దీనికి కారణం కొరటాల శివేనని ఆ నిర్మాత నమ్మకం. దీంతో చిత్రం విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చేందుకు, దాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు.

చిరంజీవికి రాంచరణ్‌కు బడా నిర్మాత క్లోజ్
ఆచార్య విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో సదరు నిర్మాత పని మరింత సులభమైంది. ఎక్కువ ప్రచారం అవసరం లేకుండానే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన పని మరింత తేలికైంది. అయితే భారీ కాంబినేషన్లతో, భారీతనంతో చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆ నిర్మాతకు చిరంజీవి, రామ్ చరణ్ తో సత్సంబంధాలున్నాయి.


ఫ్యాన్స్ చెబుతున్నదేమిటి..?
కేవలం డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వలేదనే ఉద్దేశంతో పాటు కొరటాల మీద కోపంతో వీరిద్దరి సినిమాకు నెగెటివ్ టాక్ ప్రచారం చేసేందుకు సిద్ధమవడం ఆశ్చర్యానికి గురిచేసిందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు రిపీట్ కాకుండా సినీ పరిశ్రమలోని పెద్దలంతా జోక్యం చేసుకోవాలని తెలుగు సినీ ప్రేమికులు కోరుతున్నారు. వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి అభిమానులను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమ బాగోగుల కోసమే పనిచేయాలని సూచిస్తున్నారు.