తెలంగాణ ఎన్నికల ఫలితాలు, రంగంలోకి 'కర్ణాటక రిసార్ట్' ట్రబుల్ షూటర్ శివకుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ఎంతో ఉత్కంఠను రేపుతున్నాయి. ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవని, ఒంటరిగా గట్టెక్కే పరిస్థితులు లేవని పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఎక్కువ సర్వేలు తెరాసకు, మరికొన్ని సర్వేలు మహాకూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ అవసరమైన మెజార్టీ రావడం మాత్రం చాలా కష్టంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే తెరాస, కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గెలుస్తారని భావిస్తున్న వారికి ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. తెరాసకు కొన్ని సీట్లు తక్కువ పడితే మజ్లిస్ పార్టీ అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. కూటమికి తెరాస కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ... పార్టీల వారీగా తక్కువ వస్తే గవర్నర్ తమకు చేయి ఇస్తాడని అనుమానంతో ముందే తామంతా ఒకే కూటమి అని సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు.
షాకింగ్!: 'గజ్వెల్లో 50వేల ఓట్లతో ఓడిపోనున్న కేసీఆర్, డిపాజిట్ రాని పరిస్థితి'
హైదరాబాద్‌కు ట్రబుల్ షూటర్, రిసార్ట్ సీన్లు కనిపించేనా?
తెలంగాణలో గెలుపుపై మహాకూటమి, తెరాస నేతలు ఎంతో ధీమాగా ఉన్నారు. అదే సమయంలో సీట్లు తక్కువ వస్తే.. అనే అనుమానంతో పావులు కదుపుతున్నారు. అదే జరిగితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన రిసార్ట్ సీన్లు ఇక్కడ కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారట.
నాడు కీలక పాత్ర పోషించిన శివకుమార్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. మేజిక్ ఫిగర్‌కు ఏడెనిమిది సీట్లు తక్కువ పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ప్రలోభ పెడుతుందోననే ఆందోళనతో కాంగ్రెస్ వారిని రిసార్టులను, హైదరాబాద్ హోటళ్లకు తరలించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు. అలాంటి నేత ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు.
కర్ణాటకలో చక్రం తిప్పారు
కర్ణాటక తరహా వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపడం గమనార్హం. కర్ణాటకలో విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్ , జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపునకు వెళ్లకుండా చేయడంలో ఈయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. అతనిని తెలంగాణలో రంగంలోకి దింపనుండటంతో ఆసక్తికరంగా మారింది. ఒక వేళ హంగ్ ఏర్పడితే ఆయన ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనే చర్చ సాగుతోంది. హంగ్ పరిస్థితి ఉంటే మళ్లీ రిసార్ట్, హోటల్ రాజకీయాలు ప్రారంభమయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం.
స్వతంత్రులతో ప్రభుత్వం
తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా పలువురు హైదరాబాద్ వస్తున్నారు. ఏ పార్టీకీ మెజార్టీ దక్కకుండా హంగ్ ఏర్పడితే స్వతంత్ర అభ్యర్థుల సాయంతో గట్టెక్కాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతో ఆ పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎగ్జిట్ సర్వేల నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ ఉండగా, శివకుమార్ రంగంలోకి దిగడం మరింత ఆసక్తిని రేపుతోంది.