• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోదండరాం అయితే జేపీ.. కాదంటే కేజ్రీ?

By Swetha Basvababu
|
  CM CKR vs Kodandaram : New Political Party In Telangana | Oneindia Telugu

  హైదరాబాద్: వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టీజేఏసీ) చైర్మన్ ప్రొఫెసర్ ఎం కోదండరాం సొంతంగా పార్టీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. 2019 అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికల్లో అధికారం నుంచి టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని ఆయన తలపోస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం నూతన పార్టీ స్థాపించేందుకు అనువైన వ్యూహ రచనలో కోదండరాం నిమగ్నమయ్యారని తెలుస్తోంది.

  సీఎం కేసీఆర్‌తో కలిసి ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన కోదండరాంకు ఆయన బలం, బలహీనతలేమిటో తెలుసు. సీఎం కేసీఆర్‌కు కూడా కోదండరాం పరిమితులు తెలియనివి కావు. అయితే కేసీఆర్ మాదిరిగానే కోదండరాం కూడా పట్టువదలని విక్రమార్కుడనడం అతిశయోక్తి కాదు.

   సిద్ధిపేటలో కేసీఆర్ వారసుడిగా హరీశ్ రంగ ప్రవేశం ఇలా

  సిద్ధిపేటలో కేసీఆర్ వారసుడిగా హరీశ్ రంగ ప్రవేశం ఇలా

  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1980వ దశకం ప్రారంభంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మదన్ మోహన్ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మదన్ మోహన్‌పైనే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి గురువును మించిన శిష్యుడిగా పేరొందారు కేసీఆర్. నాటి నుంచి రాజకీయ రణరంగంలో కాంగ్రెస్ ఢీ కొడుతూ అప్రతిహతంగా ముందుకు సాగారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఎన్నికయ్యారు. 2004లో గెలుపొందినా కరీంనగర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ, సిద్ధిపేటకు రాజీనామా చేయడంతో ప్రస్తుత భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గెలుపొందుతూ వచ్చారు.

   సీమాంధ్ర నేతల ముందు కేసీఆర్ రాజకీయ ఎజెండా

  సీమాంధ్ర నేతల ముందు కేసీఆర్ రాజకీయ ఎజెండా

  2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనుక్షణం రాజకీయ వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులతో వేయడంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. అపర చాణక్యుడిగా పేరొందిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును.. తర్వాత జన నేతగా వైఎస్ఆర్‌నూ ఢీకొట్టడమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా వెలుగొందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకే ఎజెండా రూపొందించిన నేపథ్యం కేసీఆర్‌ది. ఈ క్రమంలో చట్టసభలకు ఎన్నికయ్యే క్రమంలో పార్టీ బలం పలుచబడినా.. ధీరోదాత్తుడిగా అధికార, ప్రతిపక్షాల వ్యూహాలను మట్టి కరిపించి.. విద్యార్థుల నిరసనతో 2009లో దీక్ష చేసిన ఫలితంగా డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్రంతో తెలంగాణ ప్రకటన చేయించడంలో కీలక పాత్ర పోషించారు.

   ఉద్యమ సమయంలో జేఏసీ ఆందోళనలు ఇలా

  ఉద్యమ సమయంలో జేఏసీ ఆందోళనలు ఇలా

  2010లో సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొట్టేందుకు ఏర్పాటైందే టీజేఏసీ. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ సలహా మేరకు అన్ని పార్టీలను సమన్వయ పరిచేందుకు ఏర్పాటైన జేఏసీకి చైర్మన్‌గా ఎంపికైన ఎం కోదండరాం.. ఉస్మానియా యూనివర్సిటీలో పేరొందిన ప్రొఫెసర్. తెలంగాణ విద్యావంతుల ఐక్య వేదికలో కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ వాదం వినిపిస్తూ వచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ మార్గంలో అహింసాయుతంగా విద్యార్థి, యువతను యావత్ తెలంగాణ సబ్బండ వర్ణాలను తెలంగాణ సాధన పోరాటంలో మమేకం చేయడంలో కీలక పాత్ర పోషించారు కోదండరాం. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు విద్యార్థులకు నచ్చజెప్పడంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం అంటే తెలంగాణ సబ్బండ వర్ణాలకు గురి కూడా. ఆ విషయం తెలుసు కనుకే కోదండరాం రాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఆందోళనలకు శ్రీకారం చుడితేనే తెలంగాణ ప్రభుత్వానికి హడల్ అంటే అతి శయోక్తి కాదు.

   30న సరూర్ నగర్ స్టేడియంలో కొలువుల కొట్లాటకు హైకోర్టు ఓకే

  30న సరూర్ నగర్ స్టేడియంలో కొలువుల కొట్లాటకు హైకోర్టు ఓకే

  ఏడాది క్రితం ఉద్యోగాల కోసం కోదండరాం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఆందోళనను అధికార పక్షం నిర్వీర్యం చేయగలిగింది. కానీ తాజాగా కొలువుల కోసం కొట్లాట కోసం ఈ నెల 30వ తేదీన సరూర్ నగర్ స్టేడియం వద్ద సభ నిర్వహణకు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అనుమతించింది. దీని ప్రకారం ఇక ముందు కూడా న్యాయస్థానం అనుమతితో తెలంగాణ జేఏసీ తరపున ఆందోళనలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అయితే 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఆరితేరి.. ఉమ్మడి ఏపీ పాలకుల దుర్నీతిని ఎదుర్కొంటూ తెలంగాణ సాధన పోరాటంలో విజయం సాధించిన కేసీఆర్ రాజకీయ చతురత ప్రొఫెసర్ కోదండరాంకు లేదు మరి. ప్రజలకు వాస్తవాలను ఎరుక చేయడంలో ఉన్న వాస్తవికతకు తోడు పరిణతి ప్రదర్శించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లగలిగినప్పుడే విజయం సాధించగలరు.

   జేఏసీ నెట్‌వర్క్ విస్తరణపై కోదండరాం ఫోకస్

  జేఏసీ నెట్‌వర్క్ విస్తరణపై కోదండరాం ఫోకస్

  అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉన్నది. ఈ క్రమంలో పార్టీ ఏర్పాటులో భాగంగా కోదండరాం తన జేఏసీ నెట్‌వర్క్‌ను విస్తరించి పటిష్ఠ పరిచేందుకు పలు చర్యలు తీసుకుంటారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు, వ్యవసాయ కార్మికులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ నెట్ వర్క్ రూపకల్పనపై ఆయన ప్రధానంగా కేంద్రీకరించారు. మరోవైపు ఏడాదిన్నర పాటు పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అంగ, ఆర్థిక, హార్దిక బలం చేకూర్చేందుకు ప్రవాస భారతీయుల మద్దతు కూడగట్టాలని, అందునా భావ సారూప్యం గల వారిని విశ్వాసంలోకి తీసుకుని మరీ ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. అందునా టీఆర్ఎస్ ప్రభుత్వాధినేతలతో సత్సంబంధాలు లేని వారితో సంప్రదిస్తున్నట్లు సమాచారం.

   అభ్యర్థుల ఎంపికైనా ప్రొఫెసర్ నజర్

  అభ్యర్థుల ఎంపికైనా ప్రొఫెసర్ నజర్

  ఈ నేపథ్యంలో కోదండరాం ‘రాజకీయ పార్టీ' ఏర్పాటు వ్యూహానికి అనుగుణంగానే ప్రత్యేకమైన ఎజెండా రూపొందించుకుని తదనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కీలక నియోజకవర్గాల్లో అనువైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోనూ ఉన్నారని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలపై వ్యతిరేకత వాతావరణం గల నియోజకవర్గాలను ఆయన ఎంచుకుంటున్నారని సమాచారం. అయినా అధినేత కేసీఆర్ తోపాటు పలువురు రాజకీయ ఉద్ధండులకు నిలయమైన తెరాసను వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికల్లో ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం కోదండరాంకు ఉన్నాయా? అన్న సంశయాలు వ్యక్తం అవుతున్నాయి.

   రాజకీయ పార్టీ విజయం సాధించడం తేలిక కాదిలా

  రాజకీయ పార్టీ విజయం సాధించడం తేలిక కాదిలా

  ఒకవేళ ఆయన విజయం సాధిస్తే ఢిల్లీలో అధికార దండం చేపట్టిన ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా ఎదురులేని శక్తిగా నిలుస్తారు. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సత్తా పార్టీ స్థాపించి తర్వాత దాన్ని స్వచ్ఛంద సంస్థగా మలిచిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ మాదిరిగా నిలిచిపోతారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత రాజకీయ చిత్ర పటం నుంచి ఆయన నిష్ర్కమించారు. అయితే రాజకీయ పార్టీ స్థాపించి విజయం సాధించడం, ఒంటరిగా అధికారంలోకి రావడం అంత తేలికైన పని కాదని ప్రొఫెసర్ ఎం కోదండరాంకు తెలియదని భావించడం లేదు.

   సిసోడియా, యోగేంద్ర తదితరులతో కలిసి ఆమ్ఆద్మీ పార్టీ ఏర్పాటు

  సిసోడియా, యోగేంద్ర తదితరులతో కలిసి ఆమ్ఆద్మీ పార్టీ ఏర్పాటు

  కేంద్రంలో యూపీఏ మలి విడత ప్రభుత్వ హయాంలో ‘లోక్ పాల్' వ్యవస్థ ఏర్పాటుపై మొదలైన అవినీతి వ్యతిరేక ఆందోళన విస్త్రుత రూపం దాల్చింది. ఆ క్రమంలో సిటిజన్స్ ఫోరంగా అన్నా హజారే వెన్నంటి సాగిన టీంలో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, యోగేంద్ర యాదవ్ తదితరులు ఉన్నారు. వారంతా తర్వాత ఢిల్లీ కేంద్రంగా రాజకీయ ఆరంగ్రేటానికి ఏర్పాటు చేసిందే ‘ఆమ్ఆద్మీ పార్టీ'. 2013 అసెంబ్లీ ఎన్నికల నాటికి హస్తిన వాసుల సమస్యల పరిష్కారానికి కేజ్రీవాల్ అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆందోళను చేసి మరీ హస్తినాపురి వాసుల మనస్సులు చూరగొన్నారు. 2013లో గెలిచినా ‘జన్ లోక్ పాల్' బిల్లు ఆమోదానికి సహకరించలేదని కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు.

   2015లో హస్తిన వాసికి క్షమాపణతో మారిన ప్రజాతీర్పు

  2015లో హస్తిన వాసికి క్షమాపణతో మారిన ప్రజాతీర్పు

  ఫలితంగా 2014 లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆ మేరకు ప్రభావం చూపలేక పోయారు. కానీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఆవేశ పూరిత నిర్ణయంతో రాజీనామా చేసినందుకు ఢిల్లీ వాసులకు క్షమాపణ చెప్పారు. 2015 ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి మోదీ సర్కార్ నాయకత్వానికి గట్టి సవాల్ విసిరారు. 70 అసెంబ్లీ స్థానాలకు 67 చోట్ల విజయం సాధించి కమలనాథులను, ఆపై కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా సమాధానమిచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ అంతర్గత కుమ్ములాటలతో ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో ఆమ్ఆద్మీ పార్టీ విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది.

   2009లో కూకట్ పల్లి నుంచి జేపీ ఎన్నిక

  2009లో కూకట్ పల్లి నుంచి జేపీ ఎన్నిక

  1999 ఎన్నికల తర్వాత ఏర్పాటైన లోక్ సత్తా తొలుత సంస్కరణల వాద సంస్థగా నిలిచింది. 2009 ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీగా అవతరించింది. దాని తరఫున హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి దాని అధినేతగా జయ ప్రకాశ్ నారాయణ్ విజయం సాధించారు. కానీ 2010 తర్వాత పరిణామాల్లో ఆయన పాత్ర, పలుకుబడి క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2013లో వేగవంతమైన తెలంగాణ నినాదం మధ్య.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ మధ్య తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడు ముందు నిలువలేక కనుమరుగయ్యారు. 2014 ఎన్నికల సందర్భంగానే లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జయప్రకాశ్ నారాయణ్.. తన పార్టీకి ప్రజల్లో పలుకుబడి సంపాదించలేక పోయారు. ఒక మాజీ ఐఎఎస్ అధికారిగానే వ్యవహరించారే తప్ప.. జనంలోకి నేరుగా దూసుకెళ్లలేకపోయారు.

   ఒంటరిగానే సీఎం కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కోదండరాం సన్నద్ధం

  ఒంటరిగానే సీఎం కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కోదండరాం సన్నద్ధం

  ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ సీఎంగా కే చంద్రశేఖర్ రావు సమర్థత, బలం, బలహీనతలు ఆయనతో సన్నిహితంగా పని చేసిన ఒక జేఏసీ చైర్మన్‌గా కోదండరాంకు తెలియనివికాదు. క్షేత్రస్థాయిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో నెట్ వర్క్ లేకపోయినా .. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీని గెలిపించగలిగింది. కానీ ఈ దఫా అధికార టీఆర్ఎస్ కేవలం సెంటిమెంట్ అనే భావోద్వేగ సమస్యతో విజయం సాధించడం అనేది కల్ల. తొలి ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన మార్పు, ప్రగతి ప్రజలకు చూపకుండా అనుకూల తీర్పు పొందడం అంత తేలికేం కాదు. కానీ టీఆర్ఎస్ గానీ, కోదండరాం ఏర్పాటు చేయతలపెట్టిన రాజకీయ పార్టీగా గానీ సంస్థాగత వ్యవస్థ లేకుండా విజయం సాధించడం కల్ల అంటే అతిశయోక్తి కాదు. ఒంటరిగానే సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు కోదండరాం సన్నద్ధమవుతున్నారని తెలుస్తున్నది. అయితే జయప్రకాశ్ నారాయణ కంటే మెరుగ్గా ప్రజలతో మమేకమయ్యే విధానం కోదండరాంకు తెలుసు. ప్రజానుకూల నినాదం ఇవ్వడంలోనూ ఆయన ముందు ఉంటారు. కానీ కేజ్రీవాల్ మాదిరిగా దూకుడుగా ముందుకు దూసుకెళ్లలేరు.

  తెలంగాణ

  తెలంగాణ

  ఒకవేళ తప్పనిసరైతే కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర భావ సారూప్య పార్టీలతో కలిసి విస్త్రుత ప్రాతిపదికన మహా కూటమి ఏర్పాటు చేసేందుకు కోదండరాం ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ సీఎం కావాలని కోదండరాంకు ఎటువంటి ఆకాంక్షలు లేవు. కేవలం ప్రెషర్ గ్రూప్‌గా వ్యవహరించడమే ఆయన ప్రధాన లక్ష్యం తప్ప ఉన్నత పదవులపై ఎటువంటి ఆశల్లేవు. కనుక ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. కోదండరాం ఏర్పాటు చేసే పార్టీతో ముప్పు ఉంటుందని భావించడం లేదు. కానీ కేసీఆర్‌ను అధికారానికి ఎలా దూరం చేస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Joint Action Committee chairman Prof M Kodandaram is getting ready to launch a new political party in Telangana to fight the 2019 elections with a view to pull down the Telangana Rashtra Samithi from power. According to sources close to him, Kodandaram has been quietly working out a strategy for the launch of a new political party.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more