
YS Sharmila: రేవంత్ ను డామినేట్ చేస్తున్న షర్మిల - నడిపిస్తోందెవరు..!?
YS Sharmila in Telangana Politics: వైఎస్ షర్మిల. దివంగత సీఎం కుమార్తె. ఏపీ సీఎం సోదరి. తెలంగాణ రాజకీయాల్లో నాలుగు రోజులుగా షర్మిల చుట్టూ తిరుగుతున్నాయి. షర్మిలే రాష్ట్ర రాజకీయం తన వైపు తిరిగేలా చేసారు. ఈ వ్యూహం లో సక్సెస్ అయ్యారు. టీఆర్ఎస్ తో పోరాటం ప్రారంభించారు. 3500 కిలో మీటర్ల పాదయాత్ర చేసినా రాని మైలేజ్ ఒకే ఒక్క సంఘటనతో వచ్చింది.
దీంతో, ఇప్పటి వరకు టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయ యుద్దం నడుమ ఇప్పుడు షర్మిల వ్యవహారం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. షర్మిల అంశం తాత్కాలికమా.. ఎన్నికల వరకా. షర్మిల తాజా పరిణామాలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ ను డామినేట్ చేసారా. అసలు షర్మిల వెనుక ఉండి నడిపిస్తోందెవరు..ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

షర్మిలకు ఇమేజ్ పెరిగిందా...
నర్సంపేటలో టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత ఏర్పడింది. షర్మిల వాహనాలను గులాబీ పార్టీ శ్రేణులు ద్వంసం చేసాయి. షర్మిల పాదయాత్ర మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజు సొంతంగా కారు నడుపుతూ షర్మిల ప్రగతి భవన్ కు బయల్దేరారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నా..కారు దిగలేదు. షర్మిల కారులో ఉండగానే ఆ వాహనాన్ని లాగుతూ తీసుకెళ్లటం ఒక్క సారిగా షర్మిలకు కు మద్దతు పెంచటానికి కారణమైంది.
బీజేపీ నేతలు ..గవర్నర్ తో సహా షర్మిలతో వ్యవహరించిన తీరును తప్పు బట్టారు. ఆ తరువాత షర్మిల రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసారు. టీఆర్ఎస్ నేతల తీరు పైన ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో షర్మిల టీఆర్ఎస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు కారణమయ్యాయి. షర్మిల ఎపిసోడ్ జరిగిన రోజున న్యాయ పోరాటం చేసి మరీ అనుమతి తెచ్చుకున్నా...బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సభకు అంతగా మైలేజ్ రాలేదు. కానీ, కేసీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో షర్మిలకు మద్దతుగా నిలిచారు.

రేవంత్ ను మించిపోయేలా షర్మిల తీరు..
తెలంగాణలో ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని టీఆర్ఎస్ - అధికారంలోకి వచ్చి తీరుతామంటూ బీజేపీ నేతల ధీమా నడుమ కాంగ్రెస్ వెనుకబడింది. రాజకీయంగా కాంగ్రెస్ వెనుకబడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ లక్ష్యంగా ఈ మధ్య కాలంలో పోరాటాలు కాంగ్రెస్ నుంచి లేవు. ఇదే సమయంలో..షర్మిల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త టర్న్ తీసుకుంది.
షర్మిల పూర్తిగా వైఎస్సార్ అభిమానులు..రెడ్డి సామాజిక వర్గం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అదే ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ సైతం ఓన్ చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ప్రతీ సీటు ప్రతీ నియోజకవర్గం అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ఈ సమయంలో షర్మిల నాలుగో పార్టీగా ఎంత ఓట్లు చీల్చితే అంత తమకు ప్రయోజనమని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంది. కానీ, బీజేపీ - కాంగ్రెస్ చీల్చుకొనే ఓట్లు తమకు అధికారాన్ని దగ్గర చేస్తాయనేది టీఆర్ఎస్ నేతల విశ్లేషణ. దీంతో, ఇప్పుడు షర్మిల ను టార్గెట్ చేయటం వెనుక అసలు లక్ష్యం స్పష్టం అవుతోంది. ఇక, మునుగోడు ఉప ఎన్నిక సమయం నుంచి రాజకీయంగా రేవంత్ రెడ్డి వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది.

షర్మిల వెనుక ఉన్నదెవరు..
అసలు షర్మిల తెలంగాణ లో రాజకీయంగా ఎవరి మద్దతుతో ఉన్నారనే ఆసక్తి ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ కనిపిస్తోంది. బీజేపీ మద్దతుతోనే షర్మిల రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాను 3500 కిలో మీటర్ల పాదయాత్ర చేసి బీజేపీకి ఎందుకు క్రెడిట్ ఇస్తానని షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో కేసీఆర్ కలిసి పని చేసిన సమయాన్ని షర్మిల గుర్తు చేయటం ద్వారా.. పరోక్షంగా బీజేపీతో సహకారం ఉందా అనే సందేహాలకు అవకాశం కల్పించారు.
ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ షర్మిల కేంద్ర విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసారు. ఇప్పుడు అవినీతి గురించే ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా షర్మిల ఇప్పటి వరకు తెలంగాణలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ, ఈ ఒక్క పరిణామంతో అనేక ప్రశ్నలకు కారణమయ్యారు. ఇప్పుడు షర్మిల తన పోరాటం ఇదే తరహాలో దూకుడుగా కొనసాగిస్తారా..లేక, ఈ ఎపిసోడ్ కే ఇది పరిమితమా అన్నది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.