హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగింపు వేడుకల్లో.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి, పద్యం చదివి వినిపించిన కేసీఆర్

ఐదు రోజులుగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత ఐదు రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భాగ్యనగరంలో నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల ముగింపు వేడుక‌లకు భాషాభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఈ స‌భ‌లు నిర్వ‌హించిన కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 తెలుగులో ప్రసంగం ప్రారంభించిన రాష్ట్రపతి...

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన రాష్ట్రపతి...

ఈ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు భాషాభిమానులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘సోదర సోదరీమణులారా.. నమస్కారం.. దేశ భాషలందు తెలుగు లెస్స..' అంటూ తెలుగు భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించడంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. తెలుగుమహాసభల్లో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలుగు భాషకు ఎంతో చరిత్ర, విశిష్టత ఉందని అన్నారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగు అని రామ్‌నాథ్ తెలిపారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య అని, తెలుగు సాహిత్య వ్యాప్తికి శ్రీకృష్ణదేవరాయులు ఎంతో కృషి చేశారని, అంతేకాదు, రాష్ట్రపతిగా ముగ్గురు తెలుగువారు సేవలందించారని, తొలి తెలుగు ప్రధానిగా పీవీ నరసింహారావు సేవలందించారని రాష్ట్రపతి కొనియాడారు.

 హైదరాబాద్ అంటే.. బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి

హైదరాబాద్ అంటే.. బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగంలో హైదరాబాద్ ప్రత్యేకత ఏమిటో పేర్కొనడం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా 42 దేశాల నుంచి సభకు హాజరైన ప్రతి ఒక్కరీకి అభినందనలు చెబుతున్నానని ఆయన అన్నారు. తెలుగు సాహిత్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మంచి పట్టు ఉందని కోవింద్‌ కితాబిచ్చారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి అని రాష్ట్రపతి అనగానే చప్పట్లతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. తెలుగు ప్రపంచ భాష అని, ఎన్నో దేశాల్లో తెలుగువారు పేరు ప్రఖ్యాతిగాంచారంటూ.. ఆఖరుగా.. ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు..' అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ముగించారు.

 పద్యం చదివి వినిపించిన సీఎం కేసీఆర్...

పద్యం చదివి వినిపించిన సీఎం కేసీఆర్...

అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు డిగ్రీ కాలేజీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ఒక‌మూల‌న‌ కూర్చుని నేను ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌ను తిల‌కించాను.. అది 1974..' అని చెప్పారు. అదే స్టేడియంలో ఇప్పుడు స‌గౌర‌వంగా మ‌న‌ సాహితీవైభ‌వాన్ని ప్ర‌పంచానికి చాటుకున్నామ‌ని అన్నారు. తెలుగు మహాసభలు విజయంతమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకపై ప్రతియేటా తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాసభల ద్వారా తెలంగాణ సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని అన్నారు. తెలుగు భాష మృతభాష కాకూడదని, తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలు వినడం బాధాకరం అన్నారు. ఇకపై ప్రతీ ఏడాది డిసెంబర్‌లో రెండు రోజులపాటు తెలంగాణ తెలుగు సభలు నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు పరిరక్షణలో భాగంగా ఇప్పటికే విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి చేశామన్నారు. ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. రిటైర్డ్ భాషాపండితుల పెన్షన్లలో కోత లేకుండా చేస్తామన్నారు. ఈ మహాసభల ద్వారా తెలుగు భాష పరిరక్షణకు అనేక సూచనలు అందాయని, వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జనవరి మొదటివారంలో భాషా సాహితీవేత్తల సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు భాష అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తామన్నారు. చివరగా ఒక నవ్వుల పద్యం చిదివి సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

ఘనంగా మహాసభల ముగింపు వేడుకలు...

ఘనంగా మహాసభల ముగింపు వేడుకలు...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ముగింపు వేడుకల అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అత్యంత వైభవోపేతంగా కొనసాగిన ముగింపు వేడుకల్లో తెలంగాణ విశిష్టతను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ముగింపు వేడుకలను వీక్షించేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి భాషాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో తెలుగుభాష గొప్పతనాన్ని కాపాడడం మనందరి బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజున తెలుగు పుస్తకాలను వారికి కానుకగా ఇవ్వాలని సూచించారు.

English summary
Closing Ceremony of World Telugu Conference was held in LB Stadium of Hyderabad on Tuesday evening. President Ramnath Kovind attended this Closing Ceremony as Chief Guest. While giving speach he told Hyderabad means.. Biriyani, Badminton & Bahubali. Ramnath started and concluded his speach in Telugu Language. This was attracted all. CM KCR told that once upon a time as a degree student he sat in the same Stadium and watched the World Telugu Conference and in the same Stadium now he is organizing this Conference as CM. He also stated that he will organize Telugu Mahasabhalu every year in December in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X