
పట్టిన పట్టు విడవని షర్మిల దీక్ష; అణచివేతలో కేసీఆర్ దిట్ట: ఎవరు గెలుస్తారు?
పట్టు పట్టరాదు.. పట్టి విడువరాదు... పట్టనేని బిగయ పట్టవలయు అన్న చందంగా వైయస్ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైయస్ షర్మిల పాదయాత్ర అడ్డుకోవడం కోసం కెసిఆర్ సర్కార్ కూడా అంతే విఫలయత్నాలు చేస్తోంది. దీంతో వైయస్ షర్మిల ప్రస్తుతం పాదయాత్ర అనుమతి కోసం తన ఇంట్లో నుండే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తన పాదయాత్ర కు అనుమతి ఇచ్చే వరకు ఆమరణ నిరాహారదీక్షను వదిలిపెట్టేది లేదని వైయస్ షర్మిల భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల దీక్ష.. అణచివేత యత్నాల్లో పోలీసులు
నిన్న పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైయస్ షర్మిల నేడు రెండో రోజు కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. ఇక లోటస్ పాండ్ వద్ద పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతుంది. లోటస్ పాండ్ చుట్టూ అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు, పార్టీ కార్యకర్తలు కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిన్నటి నుండి బొల్లారం పోలీస్ స్టేషన్లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉన్న పరిస్థితి ఉంది. ఇక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏడుగురు పార్టీ నేతలు ఉన్నారు.

పాదయాత్ర అనుమతి కోసం భీష్మించుకు కూర్చున్న షర్మిల..కర్ఫ్యూ వాతావరణం ..
లోటస్ పాండ్ లో ఉన్న పార్టీ కార్యకర్తల కోసం అన్నపానీయాలు సైతం లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం లోటస్ పాండ్ చుట్టూ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. తన పాదయాత్ర కు అనుమతి ఇవ్వడంతో పాటు, అరెస్టు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలను విడుదల చేసే వరకు ఆమరణ నిరాహారదీక్ష ఆపేది లేదని వైఎస్ షర్మిల తేల్చి చెబుతున్నారు. తెలంగాణాలో కేసీఆర్ పై పోరాటంలో వెనకడుగు వెయ్యనన్నారు.

సీఎం కేసీఆర్ తో ఢీ కొడుతున్న షర్మిల
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వైయస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా నిరాకరించారు. వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అభ్యంతరం తెలపడంతో వైయస్ షర్మిల రాజకీయంగా డైలమాలో పడతారని భావించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఢీ కొడుతున్న షర్మిల, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా లోటస్ పాండ్ నుండే తన ప్రతిఘటన కొనసాగిస్తున్నారు.

తెలంగాణాలో షర్మిలను టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్... మోడీ ఫోన్ తో మరింత అణచివేత
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వైయస్ షర్మిల ను టార్గెట్ చేసి, కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజాక్షేత్రంలో తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు. నర్సంపేట పర్యటన నేపథ్యంలో జరిగిన దాడి ఘటన, ఆపై వైయస్ షర్మిల అరెస్టు తదితర పరిణామాలు దేశ రాజధాని ఢిల్లీ కి చేరాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైయస్ షర్మిల కు ఫోన్ చేసి పరామర్శించారు.
పదినిమిషాల పాటు షర్మిలతో మాట్లాడిన ప్రధాని ఆమెను ఢిల్లీకి రావలసిందిగా పిలిచారు. ఇక ఆ తర్వాత వైయస్ షర్మిల పై టిఆర్ఎస్ పార్టీ నేతల దూకుడు మరింత పెరిగింది. వైయస్ షర్మిల బీజేపీ వదిలిన బాణం అని టిఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు.

కేసీఆర్ అణచివెయ్యటంలో దిట్ట .. షర్మిల పోరాటంలో దిట్ట
ఈ క్రమంలోనే శాంతిభద్రతలను సాకుగా చూపి పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. అణచి వేయడంలో దిట్ట అయిన కేసీఆర్ వైయస్ షర్మిల దూకుడును కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైయస్ షర్మిల మాత్రం తనని ఎంత అణచివేతకు గురి చేసినా పోరాట పంథాను వీడేది లేదని చెబుతున్నారు. ఎటువంటి కష్టమైన పరిస్థితులు ఎదురొచ్చినా షర్మిల వెనకడుగు వేయరని గతంలోనే అనేక ఉదంతాలు స్పష్టంచేశాయి. గతంలో వైయస్ జగన్ జైలులో ఉన్న సమయంలో వైయస్ షర్మిల అన్న స్థానంలో పాదయాత్ర నిర్వహించి ప్రత్యర్థి పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించారు.

కేసీఆర్ వర్సెస్ షర్మిల.. ఎవరు గెలుస్తారో?
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఒంటరిగా పోరాటం చేస్తున్న వైయస్ షర్మిల, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఇక కెసిఆర్ వర్సెస్ వైయస్ షర్మిల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం ఎక్కడి వరకు వెళుతుంది. వైఎస్ షర్మిల స్వభావాన్ని బట్టి ఆమె తగ్గదని తెలుస్తుంది. ఇక కేసీఆర్ స్వభావ రీత్యా మహా మొండివాడు. దీంతో చివరికి ఎవరు గెలుస్తారు అన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.