కేసీఆర్ అధికారానికి, టీఆర్ఎస్ పార్టీకి చావుడప్పు కొట్టాలి: రైతు ఆవేదనయాత్రలో వైఎస్ షర్మిల ఆగ్రహం
వైయస్సార్టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కామారెడ్డి జిల్లాలో రైతు ఆవేదన యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైయస్ షర్మిల పరామర్శించారు.

ప్రాణం పోయేదాకా రైతుల కోసం కొట్లాడతా, ఈ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టండి
రైతు ఆవేదన యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల ప్రాణం పోయే వరకు రైతుల కోసం కొట్లాడతానని తేల్చి చెప్పారు. వరి వద్దనే ముఖ్యమంత్రి మనకు వద్దని పేర్కొన్న షర్మిల రైతులు బాజాప్తా గా వరి వేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. వరి వేసుకోవడం రైతుల హక్కని వైయస్ షర్మిల వెల్లడించారు. ఆమరణ నిరాహారదీక్ష చేసైనా సరే వడ్లు కొనేలా చేస్తామని తేల్చి చెప్పిన షర్మిల కెసిఆర్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓ వైపు రైతులను చంపుకుంటూ,మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటు
రైతు ఆవేదన యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఎడ్లూర్ ఎల్లారెడ్డిలో పర్యటించి, వడ్లు కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించానని వెల్లడించారు.ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణం అంటూ షర్మిల ధ్వజమెత్తారు. సరైన సమయంలో వడ్లు కొనుగోలు చేసి ఉంటే రాజయ్య మరణించేవాడు కాదని, ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారేది కాదని రైతు కుటుంబ పరిస్థితిని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఓ వైపు రైతులను చంపుకుంటూ,మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చావు డప్పు కెసిఆర్ ప్రభుత్వానికి కొట్టాలని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలకు చావు డప్పు కొట్టడానికే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా?
సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా చావు డప్పు నిర్వహించాలని పిలుపునిచ్చారని పేర్కొన్న షర్మిల, రైతులకు చావు డప్పు కొడుతున్నది మీరు కాదా అని కెసిఆర్ ను నిలదీశారు. 70 రోజుల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం మీరు కొట్టిన చావు డప్పు కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు చావు డప్పు కొట్టడానికే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైయస్ షర్మిల. ఏడు సంవత్సరాలలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు అంటూ నిలదీశారు.

కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి చావు డప్పు కొట్టాలి
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ఎంతో మంది నిరుద్యోగ యువత చావుకు కారణమైన మీకు చావు డప్పు కొట్టాలని వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎండనకా వాననకా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వడ్లు పండించిన రైతుల వడ్లు కొనుగోలు చేయని కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలని వైయస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఏం పాపం చేశారని రైతుల పైన సీఎం కేసీఆర్ ఎందుకు కక్ష కట్టాడో చెప్పాలని నిలదీశారు వైయస్ షర్మిల. యాసంగిలో వడ్లు వేయబోమని కేంద్రానికి లెటర్ రాసి ఇచ్చిన కెసిఆర్ ఎవరిని అడిగారో చెప్పాలన్నారు.

కేసీఆర్ అధికారానికి,ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలి
తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కెసిఆర్ అధికారానికి చావు డప్పు కొట్టాలని, వరి వద్దన్న ముఖ్యమంత్రి మాకొద్దని తెలంగాణ ప్రజలందరూ నినదిస్తున్నారని, మీరు సీఎంగా మాకెందుకు అంటూ వైయస్ షర్మిల కెసిఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఎండకు ఎండి వానకు తడుస్తూ పంట కల్లాలలోనే ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్న రైతులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొందరు హార్ట్ ఎటాక్ లతో మరణిస్తున్నారని, ఎంతో మంది రైతుల కుటుంబాలు దయనీయమైన పరిస్థితులలో ఉన్నాయని, రైతుల కుటుంబ సభ్యులు అప్పులపాలై తీవ్ర అగచాట్లు పడుతున్నారని ఈ చావులకు కేసీఆర్ కారణం కాదా అని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.