రైతులను ముంచే సర్కార్ మనకొద్దు.. సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిళ మరోసారి విరుచుపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో, ధర్నాలతో డ్రామాలు చేస్తుందని ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందించారు. తమకు ఏ దిక్కూ లేదంటూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పండక, పెట్టుబడి రాక, అప్పుల తీర్చలేక పురుగుల మందు తాగి ప్రతిరోజు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నారన్నారు. కనీసం ఆ రైతు కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి తేకుండా పోయిందని మండిపడ్డారు.
రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకొద్దు
ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే సీఎం కేసీఆర్ కి తెలంగాణలో రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైం కూడా లేదా అని షర్మిల ప్రశ్నించారు. రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం మీది. రైతును అప్పులపాలు చేస్తున్న ముఖ్యమంత్రి మనకొద్దు. రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ తీవ్ర స్థాయిలోఆమె విరుచుపడ్డారు.
వరి ధాన్యంపై కిరికిరి
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఆర్ సర్కార్ను వైఎస్ షర్మిల వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అడుగడుగునా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రైతుల ఆవేదనను తీర్చేవారే లేరని దుయ్యబట్టారు. అన్నదాతలను ఆదుకోవలసిన ప్రభుత్వాలు వరి ధాన్యంపై కిరికిరి పెడుతున్నాయని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్లాల్లోనే ఆగిపోతున్న రైతుల గుండెలు
ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లోనే రైతు గుండెలు ఆగిపోతున్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నాయని మండిపడ్డారు.. రైతు చనిపోతే కనీసం ఆరైతు కుటుంబాలను ఓదార్చే దిక్కు లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కోటీశ్వరులను చేశామని చెప్పుకుంటూ దగా చేస్తున్నారని దుయ్యబట్టారు.

కల్లాల్లో కయ్యాలు పెడుతూ , హస్తినలో దోస్తానా ..?
రైతులను ఒటు బ్యాంకుగా వాడుకుంటున్న ఈ రైతు హంతక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దామన్నారు. కల్లాల్లో కయ్యాలు పెడుతూ , హస్తినలో దోస్తానా చేస్తున్నారని బీజీపీ , టీఆర్ఎస్ పై మండిపడ్డారు. పాలకులు ధర్నాల డ్రామాలతో ధాన్యం కొనకుండా అన్నదాతలు చనిపోయేలా చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు షర్మిల.