
కేసీఆర్ ది దరిద్రపు పాలన; వైఫల్యాలను ఏకరువు పెట్టి... ఉరేసుకోమన్న వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ ను తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తూ ప్రజలలో కెసిఆర్ వైఖరిపై చైతన్యం తీసుకు వచ్చే పనిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు వైయస్ షర్మిల.

కేసీఆర్ ది అవినీతి పాలన.. దోపిడీ పాలన: వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేయడంలో దిట్ట అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని భక్తాళాపురం, ఎర్రం శెట్టి గూడెం, భాగ్య తండా గ్రామాలలో నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న వైయస్ షర్మిల కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ ది అవినీతి పాలన, అక్రమ పాలన, దోచుకునే పాలన, దివాలా తీసే పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన అంటూ నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణలో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలే తప్ప ప్రజలు కాదని వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

పథకాలకు పైసలుండవు కానీ టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో మాత్రం రూ.860కోట్లు ఉంటాయి
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాళేశ్వరంలో వేలకోట్ల కమీషన్లు మింగుతుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలో ఆరితేరారు అంటు వైయస్ షర్మిల ఆరోపించారు. పథకాలకు పైసలుండవు కానీ టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో మాత్రం రూ.860కోట్లు ఉంటాయి అంటూ వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. అంతేకాదు నడిబొడ్డున ప్రభుత్వ కారులోనే రేప్‌లు జరుగుతున్నా.. నిందితులను శిక్షించకుండా బిర్యానీలు తెచ్చిపెడుతున్నారు అంటూ వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాలన పై నిప్పులు చెరిగారు.

ప్రజలకు అప్పుల తెలంగాణా .. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణా
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన కెసిఆర్ ఉరేసుకుని చచ్చిపోవాలని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ అయింది. ప్రజలకు మాత్రం అప్పుల తెలంగాణ అయింది అని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఏ ఒక్క హామీని కె.సి.ఆర్ నెరవేర్చలేదని షర్మిల వ్యాఖ్యానించారు.

కేసీఆర్ దరిద్రపు పాలన ప్రతి ఇంటినీ అప్పుల పాలు చేసింది
నిరుద్యోగుల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్క లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రజలను మోసం చేసిందని షర్మిల ధ్వజమెత్తారు. బిజెపి దేశాన్ని రక్షించే ఆర్మీని సైతం కాంట్రాక్టు పద్దతికి తీసుకు వచ్చిందని వైయస్ షర్మిల మండిపడ్డారు. వైయస్ఆర్ సంక్షేమ పాలన ప్రతి గడపనూ, ప్రతి గుండెనూ తాకింది. కేసీఆర్ దరిద్రపు పాలన ప్రతి ఇంటినీ అప్పుల పాలు చేసింది అంటూ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదని , తన ఇంటి కోసం,తన పార్టీ కోసం ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు.

స్వార్ధ రాజకీయాలే సీఎం కేసీఆర్ కు ముఖ్యం
తన బిడ్డలకు పదవులు, పెద్దపెద్ద గడీలు కట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్క లేదు అని విమర్శలు గుప్పించారు. స్వార్థ రాజకీయాలే ఆయనకు ముఖ్యం అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, కేసీఆర్ పక్షాన చేరిందని, ఇక బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీ బహిరంగ రహస్యమే అని ఆరోపించారు. మాట మీద నిలబడే వైయస్ఆర్ నాయకత్వం కోసమే వైయస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని పేర్కొన్న వైయస్ షర్మిల ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అవినీతి పై, అసమర్థ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు.