• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్‌పై విరుచుకుపడ్డ షర్మిల-సొంత పార్టీ నేత నుంచే ఆమెకు బిగ్ షాక్-రాత్రికి రాత్రే పదవులు అమ్మేసుకున్నారని..

|

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాలను ట్విట్టర్ వేదికగా ఆమె తీవ్రంగా ఎండగడుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో కొలువుల నోటిఫికేషన్ల కోసం ఫైట్ చేస్తున్న షర్మిల... తాజాగా,కేసీఆర్ సర్కార్ కమీషన్ల కోసమే పనిచేస్తోందన్న అర్థం వచ్చేలా విమర్శలు చేశారు. రైతులు,యువత,ఉద్యోగులకు ఏం చేసినా కమీషన్లు రావు కాబట్టి.. కమీషన్లు వచ్చే పనులే చేస్తున్నారని ఆరోపించారు.మరోవైపు వైఎస్సార్‌టీపీపై ఆ పార్టీకే చెందిన నేత ఒకరు తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.

కమీషన్లకు కేసీఆర్ కక్కుర్తి : షర్మిల

కమీషన్లకు కేసీఆర్ కక్కుర్తి : షర్మిల

'రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్‌కు కమీషన్లు రావు. యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్‌కు కమీషన్లు రావు. డిస్కంలకు డబ్బులు చెల్లిస్తే కేసీఆర్‌కు కమీషన్లు రావు. ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే కేసీఆర్‌కు కమీషన్లు రావు. కానీ,ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కేసీఆర్‌కు కమిషన్లు వస్తాయి. మేఘ కంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయి. కమిషన్లకు కక్కుర్తి పడి అక్కరకు రాని పనులు చేస్తే గిట్లనే ఉంటది కేసీఆర్ దొర..' అని షర్మిల విమర్శించారు.

ఫీజుల పెంపుపై ఆగ్రహం...

ఫీజుల పెంపుపై ఆగ్రహం...

యూనివర్సిటీలు,డిగ్రీ కాలేజీల్లో కోర్సుల ఫీజులు పెంచడంపై షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.'కరోనా క‌ష్ట‌కాలంలో పేద విద్యార్థుల ఫీజులు త‌గ్గించాల్సింది పోయి భారీగా పెంచ‌డం దారుణం. ఒక్కో కోర్సుపై రూ.10వేల నుంచి రూ.40వేల భారం మోపుతున్నారు. ఇవి ఇంకా క‌నిష్ట‌మేనంటూ విద్యాశాఖ పేర్కొన‌డం దుర్మార్గం.కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే కేసీఆర్ దొర ఏమ‌య్యాడో..' అంటూ షర్మిల నిలదీశారు.'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల‌కు రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించ‌ని ప్ర‌భుత్వం.. ఫీజులు మాత్రం పెంచుకుంటూ పోతోంది. రాష్ట్రంలో 12.5ల‌క్ష‌ల విద్యార్థుల‌కు రూ.3,816 కోట్ల రీయింబ‌ర్స్ మెంట్ అంద‌క ఇబ్బందిప‌డుతున్నారు. వెంట‌నే పెండింగ్ బకాయిలు విడుద‌ల చేయాలి.' అని షర్మిల డిమాండ్ చేశారు.

కొత్తగూడెంలో ఇళ్ల కూల్చివేతపై...

కొత్తగూడెంలో ఇళ్ల కూల్చివేతపై...

అంతకుముందు,కొత్తగూడెంలో ఇళ్ల కూల్చివేతపై కూడా షర్మిల స్పందించారు. కొత్తగూడెంలోని రైల్వే స్థలాల్లో చాలా ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లు కూల్చివేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కొత్తగూడెంలో ఉదయం 4 గంటలకు జేసీబీలతో బలవంతంగా ఇండ్లు కూల్చడం అమానుషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల కర్కశంగా వ్యవహరించాయి. 130 కుటుంబాలు రోడ్డున పడితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. నోటీసులు ఇచ్చి ఇండ్లు కూల్చేస్తే బాధితులు ఎక్క‌డికి పోవాలి. ముందే ఇండ్లు క‌ట్టించి ఇవ్వ‌కుండా ఏం చేశారు? అసలు రైల్వే భూముల‌కు రెవెన్యూ అధికారులు ప‌ట్టాలు ఎలా ఇచ్చారు.త‌క్ష‌ణ‌మే బాధితుల‌కు ఇండ్లు క‌ట్టించి ఇవ్వాలి.' అని షర్మిల డిమాండ్ చేశారు.

షర్మిలకు షాకిచ్చిన నేత...

షర్మిలకు షాకిచ్చిన నేత...

వైఎస్సార్‌టీపీ ఒక కార్పోరేట్ వ్యవస్థలా మారిపోయిందని... రాత్రికి రాత్రి డబ్బుల కోసం పదవులు అమ్ముకున్నారని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కేటీ నర్సింహరెడ్డి అనే నేత ఆరోపించారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టాలని 2019 నుంచి వందలాది డిబేట్లలో పాల్గొన్నానని.. ఎంతో చేశానని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను బతికించాలంటే ఇలా పదవులను అమ్ముకోవద్దని,నిస్వార్థంతో పనిచేయాలని అన్నారు. మహబూబ్ నగర్‌లో పార్టీ కన్వీనర్ పదవితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం పదవులు అమ్ముకుంటే పార్టీలు బతకవన్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులను బలిచేస్తే షర్మిల పార్టీ కూడా బతకదన్నారు. కనీసం పార్టీ కార్యాలయానికి రానివాళ్లకు పదవులు ఇవ్వడం సరికాదన్నారు.పార్టీతో సంబంధం లేనివాళ్లకు,పార్టీ కోసం పనిచేయనివారికి పదవులు ఇచ్చారని ఆరోపించారు.

 నిరుద్యోగ నిరాహార దీక్ష...

నిరుద్యోగ నిరాహార దీక్ష...

ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం షర్మిల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మంగళవారం(జులై 27) నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ఆమె దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షర్మిలకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. షర్మిలతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే... నిరుద్యోగ సమస్యపై పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ పోరాటంలో షర్మిల సఫలీకృతం కావాలన్నారు. రాజన్నబిడ్డగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.స్వయంగా కలుద్దామని భావించినా..ఢిల్లీలో ఉండడం వల్ల రాలేకపోతున్నానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి సంఘీభావానికి షర్మిల థ్యాంక్స్ చెప్పారు.

English summary
ys sharmila slams cm kcr over several issues and criticises him as working for commissions only
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X