
సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణాలో ప్రభుత్వం ఉన్నట్టా.. చచ్చినట్టా? వైఎస్ షర్మిల నిప్పులు
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కెసిఆర్ అసమర్థ పాలనను టార్గెట్ చేస్తున్నారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్ర 111 వ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిల తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎకరాకు బోడి రూ.5వేలు ఇచ్చి,రైతులు కోటీశ్వరులయ్యారని చెప్తారా?
కెసిఆర్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని, అన్ని వర్గాలను కెసిఆర్ మోసం చేశారని మండిపడ్డారు. రైతుబంధు గురించి గొప్పలు చెప్పే కేసీఆర్..రైతుల ఆత్మహత్యలు మాత్రం ప్రస్తావించరు అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు బోడి రూ.5వేలు ఇచ్చి,రైతులు కోటీశ్వరులయ్యారని చెప్తున్నారని మండిపడ్డారు. వైయస్సార్ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, పంట నష్టపోతే పరిహారం, ఇలా దాదాపు 30 వేల వరకు రైతులకు లబ్ధి చేకూరిందని, అవన్నీ తీసేసి కెసిఆర్ ఐదు వేలు ఇచ్చి రైతులు కోటీశ్వరులు అయ్యారని చెబుతున్నారని వైయస్ షర్మిల మండిపడ్డారు.

ఎనిమిదేండ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు దేనికి చేసుకున్నారు
రైతులు కోటీశ్వరులు అయితే ఎనిమిదేండ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఓట్లు వేసిన పాపానికి రైతులను నిండా ముంచాడు కెసిఆర్ అంటూ వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కు ఓటు వేస్తే అభివృద్ధి చేయడం మరచిపోయి ధరలు పెంచారని, ప్రజలను ఆదుకునే బదులు పన్నులు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని వైయస్ షర్మిల మండిపడ్డారు. సన్నాసి ముఖ్యమంత్రి పాలన అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణాలో ప్రభుత్వం ఉన్నట్టా .. చచ్చినట్టా అంటూ కేసీఆర్ పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.
బేడీలు వెయ్యాల్సింది రాష్ట్రాన్ని దోచుకు తినే కెసీఆర్ కుటుంబానికి
ఎండనకా వాననకా పాదయాత్ర చేస్తున్నది వైఎస్ఆర్ పాలన కోసమే అని పేర్కొన్న వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంది అంటూ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు భూములు త్యాగం చేసిన రైతులకు కేసీఆర్ సంకెళ్లు వేయించారని వైయస్ షర్మిల మండిపడ్డారు. పరిహారం అడిగితే లాఠీలతో కొట్టించారని గుర్తు చేశారు. అన్నం పెట్టే రైతులు, మీకు రౌడీల్లా కనిపిస్తున్నారా? బేడీలు వేయాల్సింది రైతులకు కాదు.. రాష్ట్రాన్ని దోచుకుతింటున్న కేసీఆర్ కుటుంబానికి, భూములు గుంజుకుంటున్న టీఆర్ఎస్ నాయకులకు అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

కేసీఆర్ పాలనలో అవినీతికి అడ్డు లేదు
కేసీఆర్ కుటుంబ దోపిడీతో తెలంగాణా రాష్ట్రం దెబ్బ తింది అని పేర్కొన్నారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో కొత్త పెన్షన్ల జాడ లేదు. కౌలు రైతులకు సాయం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దళితులకు సాగు భూములు లేవు. నిరుద్యోగులకు కొలువులు లేవు. మహిళలకు రక్షణ లేదు. అవినీతికి అడ్డు లేదని విమర్శలు గుప్పించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు పరిహారానికి బదులు సంకెళ్లు వేయించిన ఘనుడు కెసిఆర్ అంటూ వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.