దొర అహంకారాన్ని దించితేనే.. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ.. కేసీఆర్పై షర్మిల ఫైర్..
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు . ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ రావాలంటే దొర అహంకారాన్ని దించాలన్నారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ వరుసగా ట్విట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల కష్టాలు పోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని ఫైర్ అయ్యారు. బంగారు భవిష్యత్తు కోసం తెచ్చుకున్న తెలంగాణలో సామాన్యుల బతుకులు ఆగమైపోతున్నాయన్నారు.

ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడు?
కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుందని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు. ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు. ఓ రోజు ధరణి తప్పుల తడకకు చనిపోయే రైతు వంతు.
ఓ రోజు అసైన్డ్ భూముల కోసం బలైన రైతు వంతని మండిపడ్డారు. మరో రోజు పోడు భూములకై ఆత్మహత్య చేసుకొనే గిరిజన రైతు వంతు . ఓ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ల వంతు. ఓ రోజు RTC ఉద్యోగుల వంతు. ఓ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ అందని విద్యార్థి వంతు. ఓ రోజు వైద్యం అందని కరోనా రోగుల వంతని దుయ్యబట్టారు.
దొర అహంకారాన్ని దించాలి..
ఇదే కేసీఆర్ పాలనలో బతకలేని తెలంగాణ అని షర్మిల ప్రశ్నించారు.. బంగారు తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలంటే, చావులు లేని తెలంగాణ రావాలంటే దొరగారి అహంకారాన్ని దించాలని ఆమె పిలుపునిచారు. రైతులు, నిర్యోగుల ఆత్మహత్యలపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ట్విట్టర్లో పోస్ట్ చేసి.. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణను , యువత భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తున్నారని మండిపడ్డారు.

స్థానికులనే స్థానికేతరులను చేసిన దొరగారి
స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని సాధించుకొన్న తెలంగాణలో.. స్థానికులనే స్థానికేతరులను చేసిన దొరగారి 317 జీవో అంటూ షర్మిల మండిపడ్డారు. ఈ జీవో రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు తమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. తప్పుల తడగా ఉన్న జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అటు రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
YSR హయాంలో ఒక్కరోజు కూడా RTC చార్జీలు కానీ, కరెంట్ చార్జీలు కానీ, హౌస్ టాక్స్ లు కానీ పెరిగింది లేదు. కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో పెంచని చార్జీలు లేవని విమర్శించారు.. మొన్న RTC ఛార్జీలు, ఇప్పుడు కరెంట్ ఛార్జీలు. 50 యూనిట్ల లోపు వాడుకొనే 40 లక్షల పేదవాళ్లను కూడా వదలకుండా ముక్కు పిండి వసూల్ చేస్తున్నారని దుయ్యబట్టారు షర్మిల.