వైఎస్ షర్మిల అన్వేషణ: ఖమ్మం అభిమానులతో భేటీకి ముహూర్తం ఫిక్స్: ఫోకస్ ఆయన పైనే
హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతోన్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. తొలిరోజు- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన నల్లగొండ జిల్లా అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమైన ఆమె.. మలి విడత భేటీ సమాయాత్తమౌతోన్నారు. ఈ నెల 20వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభిమానులతో సమావేశం కానున్నారు. వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఈ జిల్లాలో ఉందనే అంచనాలు ఉన్నాయి.
బాలకృష్ణ లెవెల్లో చంద్రబాబు తొడగొట్టినా: గోచీ తలకు చుట్టుకుంటే ఎలా: వైస్రాయ్ కుట్ర: సజ్జల

పొంగులేటిపై ఫోకస్..
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశాన్ని నిర్వహించబోతోన్న నేపథ్యంలో.. అందరి దృష్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నిలిచాయి. ఇదివరకు ఆయన వైఎస్సార్సీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనాన్ని తట్టుకుని ఆయన వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన నామా నాగేశ్వర రావును ఆయన మట్టికరిపించారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి.. టీఆర్ఎస్లో చేరారు. 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు.

టీఆర్ఎస్లో ఉన్నా..
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేసి, విజయం సాధించారు. అప్పటి నుంచీ క్రియాశీలక రాజకీయాల్లో లేరు. టీఆర్ఎస్తోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఉద్దేశపూరకంగానే టీఆర్ఎస్ నాయకత్వం తనను పక్కన పెట్టిందనే ఉద్దేశంలో పొంగులేటిలో కనిపిస్తోందని, ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ రావడం, పైగా తాను అభిమానించే వైఎస్సార్ కుటుంబ సభ్యురాలు దీన్ని నెలకొల్పబోతోండటంతో ఆయన చేరిక లాంఛనమే కావచ్చని చెబుతున్నారు. దీనికి కొంత సమయం పట్టొచ్చనీ, పార్టీ విధి విధానాలు వెల్లడైన తరువాత చేరుతారనే వాదన కూడా వినిపిస్తోంది.

కొత్త భవనం కోసం అన్వేషణ..
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్టీపీ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పబోతోండటంతో.. పొంగులేటి ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఆ అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యక్తమౌతోన్నాయి. మరోవంక- వైఎస్ షర్మిల కొత్త పార్టీ కార్యాలయ భవనం కోసం అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. భవిష్యత్లో అభిమానుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. పార్టీ కార్యకలాపాలను కొనసాగించడానికి సువిశాలంగా ఉండే కొత్త భవనం కోసం ఆమె గాలిస్తున్నట్లు చెబుతున్నారు. రవాణా సౌకర్యం అందుబాటులో ఉండే ప్రాంతంలో కొత్త కార్యాలయం భవనాన్ని తీసుకోవాలని సూచించారని అంటున్నారు. దీనికోసం ఒకట్రెండు ప్రాంతాల పేర్లను ఆమె ముందుకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.