తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ మాస్టర్‌ప్లాన్: ఈ రెండు అంశాలపై ఫోకస్: మతం..విగ్రహాల ధ్వంసం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ శ్రీకారం చుట్టింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని శ్రీకాళహస్తిలో ఇతర వెనుకబడిన కులాల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం కొనసాగిన తీరు.. అందులో పాల్గొన్న కీలక నేతల ప్రసంగ శైలి.. దాదాపుగా విగ్రహాల విధ్వంసం, ఆలయాలపై దాడుల చుట్టే పరిభ్రమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతలపై విమర్శలు గుప్పించినప్పటికీ.. అవి కూడా ఆలయాలు, హిందూయిజానికి సంబంధించినవే.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలో వైసీపీ: స్టార్ క్యాంపెయినర్లు: యంగ్ లీడర్లకే బాధ్యతలు?

ఈ రెండు అంశాలపైనే ప్రచారం..
రాష్ట్రంలో కొద్దిరోజులుగా దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. ఇదివరకు తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయానికి చెందిన రథం మంటల బారిన పడటం.. ఆ తరువాత విజయనగరం జిల్లా రామతీర్థం, ఆ వెంటనే విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో కోమాలమ్మ అమ్మవారి పాదముద్రల ధ్వంసం..ఆ వెంటనే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చేతులను పగులగొట్టిన ఘటన, తాజాగా విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంసమైన ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. దీనిపట్ల రాజకీయ దుమారం చెలరేగుతోంది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఉండటం వల్లే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఎదురైన మొట్టమొదటి ఉప ఎన్నిక ఇది. దీనితో అన్ని రాజకీయా పార్టీల దృష్టీ తిరుపతిపైనే నిలిచింది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన తీరును ఆధారంగా చేసుకుని వైఎస్సార్సీపీ ఉప ఎన్నిక బరిలో దిగుతోంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు విగ్రహాల విధ్వంసం చుట్టే ప్రచార కార్యక్రమాలను తిప్పే అవకాశాలు ఉన్నాయి. తాజాగా శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఓబీసీ సభలో నేతలు చేసిన ప్రసంగం దీన్ని స్పష్టం చేసినట్టయింది. అంతర్వేది మొదలుకుని.. విజయవాడ సీతమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం వరకూ అన్నింటినీ ప్రస్తావించారు కమలనాథులు.

లెక్క పెట్టి మరీ..
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. విగ్రహాల విధ్వంసం, ఆలయాలపై దాడులకు సంబంధించిన 150 ఘటనలు చోటుచేసుకున్నాయని సునీల్ దేవ్‌ధర్ ఆరోపించారు. అంతర్వేది రథం దగ్ధమైన కేసును సీబీఐకి అప్పగించడంలో అర్థం లేదని, దీనితో శాంతి భధ్రతలను కాపాడటంలో జగన్ సర్కార్ విఫలమైందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్టయిందని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడలేకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ-జనసేనలకు ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూడాలని, దేవాలయాలపై దాడులను ఎలా అరికట్టగలమో తాము నిరూపిస్తామని అన్నారు.
చంద్రబాబును చందాలబాబుగా..
సీతమ్మ అమ్మవారిని అపహరించిన రావణాసురుడు ఎలా పతనం అయ్యాడో.. విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహం విధ్వంసాన్ని అడ్డుకోలేని జగన్ ప్రభుత్వం కూడా అలాగే పతనమౌతుందని సునీల్ దేవ్‌ధర్ జోస్యం చెప్పారు. ఇదవరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ దేవాలయాలపై దాడులు చోటు చేసుకున్నాయని సునీల్ దేవ్‌ధర్ విమర్శించారు. చంద్రబాబును.. చందాల బాబుగా ఆయన అభివర్ణించారు. తమకు హిందువులు కావాలో.. క్రైస్తవులు కావాలో.. తేల్చుకోవాల్సిన అవకాశం తిరుపతివాసులకు కలిగిందని, వచ్చే ఉప ఎన్నికలో తమ అభిప్రాయాన్ని చాటాలని సూచించారు.