టీటీడీ నుంచి ఆ సీనియర్ ఐఎఎస్ బదిలీ: సీఎంఓలో: తన శాఖకు ఏరికోరి తెచ్చుకున్న మంత్రి రోజా
తిరుపతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ ఈ ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివారం సెలవురోజే అయినప్పటికీ- పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ దీనికి సంబంధించిన జీవోను జారీ చేశారు. మొత్తంగా- నలుగురు ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం స్థానం చలనం కల్పించింది ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించలేదు. వేరే అధికారులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతల నుంచి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇక ఆయన పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తారు. ఇదివరకే ఆయనను ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేసినప్పటికీ.. టీటీడీ ఈఓగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పించింది.

ప్రస్తుతం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారిగా పని చేస్తోన్న ఐడీఈఎస్ అధికారి ఏవీ ధర్మారెడ్డిని ఈఓగా అపాయింట్ చేసింది. టీటీడీ ఈఓ హోదాలో ఆయన పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం సత్యనారాయణను నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా మహ్మద్ ఇంతియాజ్‌కు కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఆయన గ్రామీణ పేదరిక నిర్మూల సొసైటీ సీఈఓగా ఉంటోన్నారు.
యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవిని నియమించింది ప్రభుత్వం. ఇదివరక ఈ స్థానంలో సీ నాగరాణి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. నాగరాణిని రిలీవ్ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో శారద దేవిని అపాయింట్ చేసింది. పర్యాటకం, సాంస్కృతికం, యువజన సర్వీసు వ్యవహారాల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చోటు చేసుకున్న బదిలీ ఇది. శారదా దేవిని రోజా ఏరికోరి నియమించుకున్నట్లు చెబుతున్నారు.