టీటీడీపై జగన్ సర్కారుకు కేంద్రం షాక్- నో సపరేట్ రూల్- కుదరదన్న నిర్మల
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. ఓ కీలక డిమాండ్‌పై ఎంతో కాలంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పార్లమెంటు సాక్షిగా నో చెప్పేసింది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు ప్రత్యేక హోదా వంటి విభజన హామీల విషయంలోనూ పార్లమెంటులో వరుస షాకులు ఇస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. టీటీడీ విషయంలోనూ నో చెప్పేయడంతో ఇప్పుడు వైసీపీ ఎంపీలు నిరాశగా నిట్టూర్చాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

టీటీడీపై కేంద్రం సాయం కోరిన జగన్
ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు కలిగిన తిరుమల తిరుపతి దేవస్ధానం ఆర్ధిక వ్యవహారాల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం జగన్ గతంలో కోరారు. కేంద్రంలో పెద్దలను కలిసినప్పుడు పదే పదే విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా విదేశీ విరాళాలు, కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పాత నోట్ల చెల్లుబాటు, జీఎస్టీ మినహాయింపు వంటి అంశాల్లో జగన్ ఎన్నోసార్లు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాకూ వినతిపత్రాలు ఇచ్చారు. కానీ కేంద్రం మాత్రం కనికరించలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

జీఎస్టీ మినహాయింపుపై షాక్
ఏటా తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తులు సమర్పించే విరాళాలతో పాటు వసతి గృహాల అద్దెలు, లడ్డూ ప్రసాదంలో వాడే సామాగ్రిపై జీఎస్టీ బాదుడు భారీగా పెరిగిపోయింది. దీంతో టీటీడీకి జీఎస్టీ మినహాయంపు ఇవ్వాలని వైసీపీ సర్కారు కేంద్రాన్ని పదే పదే కోరింది. తాజాగా పార్లమెంటులో ద్రవ్యబిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీలు మరోసారి ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కానీ టీటీడీకీ జీఎస్టీ మినహాయింపు ఇచ్చేందుకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ససేమిరా అన్నారు. దీంతో వైసీపీ ఎంపీలకు నిరాశ తప్పలేదు.

టీటీడీకీ సపరేట్ రూల్స్ లేవన్న నిర్మల
ఏటా కోట్లాది మంది భక్తులు దర్సించుకునే తిరుమల దేవస్ధానాన్నీ దేశంలోనూ ఇతర గుళ్లతో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పోల్చారు. దేశంలో ఇతర గుళ్లకూ జీఎస్టీ మినహాయింపు లేదని ఆమె స్పష్టం చేశారు. టీటీడీకీ ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. తద్వారా మీకు జీఎస్టీ మినహాయింపు ఇస్తే మిగతా గుళ్లకు కూడా ఇవ్వాల్సి వస్తుందనే అక్కసు నిర్మల మాటల్లో కనిపించింది. రాజ్యసభలో ద్రవ్యబిల్లుపై చర్చ సందర్భంగా నిర్మల ఇచ్చిన సమాధానంతో టీటీడీకి జీఎస్టీ మినహాయింపు దక్కుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్న వైసీపీ సర్కారుకు కూడా భారీ షాక్ తగిలినట్లయింది.