తిరుమలలో నయనతార దంపతుల అపచారం.. టీటీడీ సీరియస్; క్షమాపణలు కోరిన కొత్తజంట!!
ఇటీవల మూడుముళ్ల బంధంతో ఏకమైన నయనతార, విఘ్నేష్ దంపతులు వివాహానంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇక తిరుమలలో వారు మాడ వీధుల్లో చెప్పులతో తిరుగుతున్న వీడియో వైరల్ కావడంతో వివాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని రెండు రోజులైనా గడవకముందే చోటు చేసుకున్న వివాదం చర్చనీయాంశంగా మారింది.

తిరుమలలో అపచారం.. నయనతార దంపతులపై టీటీడీ సీరియస్
తిరుమాడ వీధుల్లో నయనతార దంపతులు చెప్పులతో తిరుగుతున్న వీడియో వైరల్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఘటనపై టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నయనతార దంపతులు ప్రవర్తించడంతో వారికి నోటీసులు జారీ చేయనున్నట్టు టిటిడి అధికారులు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమాడవీధుల్లో నయనతార చెప్పులతో తిరిగినట్టు గుర్తించామని ఫోటో షూట్ నిర్వహించినట్లు అక్కడ వీడియోల ద్వారా స్పష్టమైందని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ వెల్లడించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా నయనతార దంపతులు వ్యవహరించినందుకు వారికి నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

బహిరంగ క్షమాపణలు కోరుతూ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ లేఖ
అయితే తిరుమలలో స్వామివారి ఆలయ సమీపంలో చెప్పులు వేసుకొని తిరిగిన నయనతార దంపతుల వివాదంపై నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఓ లేఖ ద్వారా బహిరంగ క్షమాపణలు కోరారు. తమకు తిరుమల శ్రీవారి పై అపారమైన నమ్మకం, భక్తి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దర్శనం అనంతరం భక్తులు ఎక్కువగా ఉండటంతో తిరిగి వెళ్లిపోయి, ఆ తర్వాత ఫోటోషూట్ కోసం హడావిడిగా చెప్పులు వేసుకుని వచ్చామని, పొరపాటు జరిగిందంటూ ఆయన పేర్కొన్నారు.

తెలియక చేసిన తప్పు .. క్షమించాలని నయనతార భర్త విజ్ఞప్తి
తాము తెలియక చేసిన తప్పును క్షమించాలని విఘ్నేశ్ శివన్ అటు భక్తులను ఇటు టిడిపి అధికారులను కోరారు. తాము తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని ఎంతోకాలంగా అనుకున్నామని, గడిచిన 30 రోజుల్లోనే ఐదు సార్లు తిరుమలకు వచ్చామని విఘ్నేశ్ శివన్ తెలిపారు. కొన్ని అనివార్య కారణాలవల్ల తిరుమలలో పెళ్లి చేసుకోవడం సాధ్యం కాకపోవడంతో మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

స్వామిని అవమానించటానికి ఇలా చెయ్యలేదన్న విఘ్నేశ్ శివన్
అయితే పెళ్లి అయిన వెంటనే మండపం నుంచి నేరుగా శుక్రవారం తిరుమల వచ్చి స్వామివారి కళ్యాణం చూసి ఆశీస్సులు తీసుకున్నామని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. తమకు తిరుమల శ్రీవారి పట్ల అపారమైన భక్తి ఉందని తెలిపారు. తిరుమల శ్రీవారిని తాము ఎంతగానో ఆరాధిస్తాం అని చెప్పిన ఆయన స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదని, దయచేసి క్షమించండి అంటూ లేఖలో పేర్కొన్నారు.