అరుదైన సన్నివేశం... తండ్రిని మించిన తనయ... పోలీస్ కూతురికి పోలీస్ తండ్రి సెల్యూట్
కన్నబిడ్డలు ప్రయోజకులైతే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతారో మాటల్లో వర్ణించలేనిది. ఒకవేళ తల్లిదండ్రులనే మించిపోతే వారికి అంతకుమించిన గర్వకారణం ఉండదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ పోలీస్ అధికారి కూతురు తండ్రిని మించిన తనయగా అందరి దృష్టిని ఆకర్షించింది. విధుల్లో భాగంగా ఆ అధికారి ఉన్నతాధికారి అయిన తన కూతురికి సెల్యూట్ చేయడం ప్రతీ ఒక్కరి మనసును తాకింది. ఈ అరుదైన సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది.

పోలీస్ డ్యూటీ మీట్లో..
2018 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పీగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో "దిశ" విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ జెస్సీ తండ్రి శ్యామ్ సుందర్ తిరుపతి కళ్యాణి డ్యామ్‌లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు.పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా శ్యామ్ సుందర్ కూడా ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.

కూతురికి తండ్రి సెల్యూట్ కొట్టిన వేళ...
ఈ క్రమంలో డీఎస్పీ హోదాలో ఉన్న తన కూతురు ఉన్నతాధికారులతో మాట్లాడుతుండగా శ్యామ్ సుందర్ ఆమె వద్దకు వెళ్లారు. 'నమస్తే మేడమ్..' అంటూ కూతురికి సెల్యూట్ చేశారు. దీంతో ఆశ్చర్యపోయిన కూతురు 'నాన్నా...' అంటూ నవ్వేశారు. ఈ సీన్ చూసి చాలామంది తండ్రిని మించిన తనయ అంటూ ప్రశంసలు కురిపించారు.కూతురికి సెల్యూట్ చేయడంపై సీఐ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ... పిల్లలు ప్రయోజకులైతే తండ్రికి అంతకుమించిన సంతోషం ఏముంటుందన్నారు. తన బిడ్డ నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ... ఇలాంటి సన్నివేశాలు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటామన్నారు. తిరుపతి డ్యూటీ మీట్లో తండ్రీకూతుళ్లు ఇలా యూనిఫాం ధరించి విధుల్లో పాల్గొనడం వ్యక్తిగతంగా గర్వంగా ఉందన్నారు.

గతంలోనూ ఇలాంటి సన్నివేశం...
గతంలో ఇలాంటి సన్నివేశమే తెలంగాణలోనూ చోటు చేసుకుంది. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంగర కలాన్‌లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభ ఇందుకు వేదికైంది. సభా ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తండ్రీకూతుళ్లయిన ఎస్పీ సింధూ శర్మ,డీసీపీ ఉమా మహేశ్వరరావు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో తనకంటే పెద్ద ర్యాంకులో ఉన్న కూతురు సింధు శర్మకి ఉమా మహేశ్వరరావు సెల్యూట్ చేశారు. ఈ సన్నివేశం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. తన కూతురికి సెల్యూట్ కొట్టడం చాలా గర్వంగా ఉందంటూ అప్పట్లో ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.