పింక్ డైమండ్ ఆచూకీ తేల్చండి- సీవీసీకి ఫిర్యాదు- సీబీఐ లేదా డీఆర్ఐతో దర్యాప్తు కోరుతూ..
తిరుమల శ్రీవారి ఆలయంలో పింక్ డైమండ్ గురించి ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. పింక్ డైమండ్‌ను టీడీపీ ప్రభుత్వ పెద్దలు కాజేశారంటూ వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి టీడీపీ సర్కారు టీటీడీ ప్రధాన అర్చకుడిగా తొలగించడంతో కాక మీదున్న రమణ దీక్షితులు తన హయాంలో పింక్ డైమండ్‌తో స్వామి వారికి అలంకారం చేసినట్లు బహిరంగంగానే చెప్పారు. అయితే ప్రభుత్వం మారడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు గతంలో తాము చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించకపోవడంతో ఇవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు తిరుపతికి చెందిన ఓ న్యాయవాది పింక్ డైమండ్ ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ సీవీసీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

టీడీపీ హయాంలో పింక్ డైమండ్ చర్చ...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పింక్ డైమండ్ చర్చ తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి అలంకారంలో పింక్ డైమండ్‌ను వాడినట్లు ప్రచారమే తప్ప ఎప్పుడూ దాన్ని ఎవరూ చూసింది లేదు. మైసూరు రాజులు శ్రీవారికి బహూకరించిన ఈ పింక్ డైమండ్‌ను గతంలో వాడినట్లు ఎక్కడా రికార్డులు లేవు. కానీ చంద్రబాబు హయాంలో తొలిసారిగా ఈ చర్చ మొదలైంది. దీనికి కారణం టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు. ఆయన కూడా అంతకు ముందు పింక్ డైమండ్ గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను మార్చి టీటీడీ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించగానే ఆయనకు పింక్ డైమండ్ గుర్తుకొచ్చింది. గతంలో పింక్ డైమండ్ ఉండేదని దాన్ని తాను స్వయంగా స్వామికి అలంకరించానంటూ కానీ ఆ తర్వాత ఏమైందంటూ తెలియదంటూ రమణదీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు.

రమణదీక్షితులు ఆరోపణల వెనుక వైసీపీ...
పింక్ డైమండ్ మాయమైందంటూ టీటీడీ ప్రధాన అర్చకుడు టీడీపీ హయాంలో చేసిన ఆరోపణల వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉందని చెబుతారు. అప్పట్లో అసలు చర్చలోనే లేని పింక్ డైమండ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు టీడీపీ పెద్దల ప్రమేయంతోనే అది మాయమైందన్న అర్ధం వచ్చేలా రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. వీటిని అందుకున్న వైసీపీ నేతలు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అసలు పింక్ డైమండే లేదని టీడీపీతో పాటు తిరుమల గుడిలో ఊన్న వారు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. అంతిమంగా ఈ ఆరోపణలు వైసీపీకి ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే పనికొచ్చాయి.

వైసీపీ, రమణదీక్షితులు మౌనం...
గతంలో పింక్ డైమండ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీతో పాటు రమణదీక్షితులు కూడా అధికారంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతుంటే రమణదీక్షితులు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. అప్పట్లో తాము ఆరోపణలు చేసిన పింక్ డైమండ్ ఎక్కడుందో తెలుసుకోవడం వీరికి పెద్ద పనేం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాన్ని పక్కనబెట్టేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అసలు పింక్ డైమండ్ అనేది లేనే లేదు. ఉండి ఉండే టీటీడీ రికార్డుల్లో ఎక్కడో ఒక చోట దర్శనమిచ్చేది. అప్పుడు ఎవరి హయాంలో దాన్ని ఎవరు మాయం చేశారనే అంశం బయటికొచ్చేది. కానీ ఇప్పటికీ వైసీపీ సర్కారు దాన్ని పట్టించుకోవడం లేదు. అలాగే టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన సైతం దానిపై దర్యాప్తు చేయించే అవకాశం ఉన్నా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.

పింక్ డైమండ్ విదేశాలకు వెళ్లిందా ? లేదా
వైసీపీ సర్కారు వదిలేసిన పింక్ డైమండ్ ఆచూకీ తేల్చే వ్యవహారంపై ఇప్పుడు తిరుపతికి చెందిన విద్యాసాగర్ అనే న్యాయవాది సీవీసీకి ఫిర్యాదు చేశారు. సీబీఐ లేదా డీఆర్ఐ దర్యాప్తు చేయిస్తే పింక్ డైమండ్ ఆచూకీ దొరుకుతుందంటూ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను కోరారు. ఇందులో ఆయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు. స్వామి వారి అభరణాలపై జరిగిన పలు విచారణల్లో రమణ దీక్షితులు పింక్ డైమండ్ ఉందంటూ చెప్పారని, కానీ ఏ విచారణలోనూ అది ఉందని తేలలేదన్నారు. కానీ రమణదీక్షితులు దాన్ని జెనీవాకు తరలించి రూ.500 కోట్లకు వేలం వేశారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై ఆర్కిలాజికల్ ఇండియా వంటి సంస్ధలు కూడా తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు కనిపెట్టలేకపోయారన్నారు. ఇది నిజంగా విదేశాలకు వెళ్లి ఉంటే స్ధానిక దర్యాప్తు సంస్ధల కంటే కేంద్ర ప్రభుత్వ సంస్ధలే దర్యాప్తు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే ఈ వ్యవహారంపై సీబీఐ లేదా డీఆర్ఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.