తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలో వైసీపీ: స్టార్ క్యాంపెయినర్లు: యంగ్ లీడర్లకే బాధ్యతలు?
తిరుపతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి సన్నద్ధమౌతోంది. జనవరి 6వ తేదీ నుంచి ప్రచార బరిలో దిగబోతోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోో డోర్ టు డోర్ క్యాంపెయిన్‌ను చేపట్టనుంది. దీనికి అవసరమైన బ్లూప్రింట్‌ను చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారం. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను యువ నేతలకు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వారసులను దీనికోసం ఎంపిక చేసినట్లు సమాచారం.

ఫిజియోథెరపిస్ట్ డా గురుమూర్తి పేరు
ఎస్సీ రిజర్వుడ్‌కు చెందిన తిరుపతి లోక్‌సభ స్థానానికి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును ఇదివరకే వెల్లడించింది వైఎస్ఆర్పీపీ. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జనవరి 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. డాక్టర్ గురుమూర్తి పేరును అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీనితో ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టవుతుందని అంటున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులు ప్రచార కార్యక్రమాలను చేపడతారు.

ఎమ్మెల్యేల వారసులకు ఛాన్స్?
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను యువనేతలకు అప్పగించాలని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి ఒక అవకాశాన్ని ఇచ్చినట్టవుతుందనే అభిప్రాయం కీలక నేతల్లో నెలకొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారులు అభినయ్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, కుమార్తె పవిత్రా రెడ్డి వంటి యువనేతలకు ప్రచార బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు.

ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు..
తిరుపతి లోక్‌సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ వైసీపీ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ఏడు చోట్లా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. తిరుపతి లోక్‌సభ కూడా వైసీపీదే. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద రావు మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. లోక్‌సభ సహా దీని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా దిశా నిర్దేశం..
ఈ నెల 28వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఊరందూరులో వైఎస్ జగన్ రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక గురించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారని అంటున్నారు. విజయం సాధించడం ఖాయమే అయినప్పటికీ.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వైఎస్ జగన్ పార్టీ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. భారీ మెజారిటీని లక్ష్యంగా నిర్దేశించినట్లు సమాచారం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించబోతోండటం వల్ల పోటీ తీవ్రంగా ఉండటం ఖాయం.