బీజేపీ-జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్: లేదంటే..తెగతెంపులే: తిరుపతి బరిలో సొంతంగా
తిరుపతి: తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక.. భారతీయ జనతా పార్టీ-జనసేన కూటమికి అగ్నిపరీక్షగా మారబోతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మూణ్నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బరిలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పొత్తు పార్టీ బీజేపీకి అవకాశం ఇచ్చామని, ఈ సారి ఆ ఛాన్స్.. తమకు ఇవ్వాల్సి ఉంటుందనే డిమాండ్..జనసేనలో బలంగా వినిపిస్తోంది.

రాజకీయ వ్యవహారాల కమిటీలో కీలక అంశాలపై చర్చ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. తిరుపతిలో ఏర్పాటైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు పాలవలస యశస్వి, కందుల దుర్గేష్, బీ శ్రీనివాస యాదవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశం సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపై ప్రభుత్వంపై రాజకీయంగా ఎలాంటి వైఖరిని అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై చర్చించారు.

బీజేపీ-జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా..
తిరుపతి లోక్సభ స్థానాన్ని తాము వదులుకోవాల్సిన పరిస్థితే ఏర్పడితే.. కొన్ని డిమాండ్లను బీజేపీ నెరవేర్చాల్సి ఉంటుందని, వాటిపై హామీ ఇవ్వాల్సి ఉంటుందని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరును ప్రకటించాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్ర నాయకులు ఓ విస్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు.

ఇప్పటికే జీహెచ్ఎంసీని వదులుకున్నాం..
ఇప్పటికే తాము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నామని, ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టాల్సిందేనని కమిటీ సభ్యులు పట్టుబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ నాయకులు చూపిన పోరాటం, తెగువ.. తిరుపతిలో ఏ మేరకు ప్రదర్శించగలుగుతారనే అనుమానాలను వారు వ్యక్తం చేశారు. జనసేన అభ్యర్థి పోటీలో ఉంటే.. బీజేపీ అగ్ర నాయకులు ప్రచారానికి తప్పనిసరిగా రావాల్సి ఉంటుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థి గెలుపు బాధ్యతలను తమ భుజాలపై మోయాలని అన్నారు.

బలం పెరిగింది..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల నాటితో పోల్చుకుంటే.. ఇప్పుడు తమ పార్టీ బలం పెరిగిందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి స్థానంలో బీజేపీ కంటే తాము పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అభ్యర్థికి అధికంగా ఓట్లు పోల్ అయ్యాయనే విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఏడాది కాలంలో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటాల వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరిగిందని, ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడం ఏ మాత్రం మంచిది కాదనే అభిప్రాయాన్ని బలంగా వినిపించారు.