తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
తిరుపతి: తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ముహూర్తం ముంచుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అదే తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కావడంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఉప ఎన్నిక బరిలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై భారతీయ జనతా పార్టీ-జనసేన ఏకాభిప్రాయానికి రావట్లేదు. తిరుపతి బరిలో పోటీ చేయడానికి ఒకవంక బీజేపీ రాష్ట్ర నాయకులు అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పోటీ చేసే అవకాశాన్ని పొత్తు పార్టీ జనసేనకు ఇవ్వబోవట్లేదనే సందేశాన్ని పంపించారు. అదే సమయంలో- జనసేన కూడా తిరుపతి ఎన్నికపైనే దృష్టి సారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజేపీ-జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్: లేదంటే..తెగతెంపులే: తిరుపతి బరిలో సొంతంగా

బీజేపీతో కలిసి అవగాహనకు వచ్చాం..
ఇలాంటి పరిణామాల మధ్య తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై పవన్ కల్యాణ్.. ఓ కీలక ప్రకటన చేశారు. ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై ఇప్పటికే తాము ఒక అవగాహనకు వచ్చామని.. దీనిపై త్వరలో నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. మరో రెండు, మూడు విడతల్లో సమావేశం కావాల్సి ఉందని అన్నారు. తిరుపతి టికెట్ ఎవరికి ఇచ్చినా.. బీజేపీ-జనసేనల్లో ఎవరు పోటీ చేసినా.. అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. బీజేపీ-జనసేన కూటమి బలోపేతానికి పనిచేయాల్సిందేనని అన్నారు.

తిరుపతి బలమైన స్థానమే..
తమ పార్టీకి తిరుపతి బలమైన స్థానమే అయినప్పటికీ.. అభ్యర్థిని పోటీ దించే విషయంలో పొత్తు పార్టీ బీజేపీతో సంప్రదింపులను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను తిరుపతికి వచ్చినప్పటి నుంచీ ప్రతి ఒక్కరూ జనసేన అభ్యర్థినే బరిలో దింపాలని డిమాండ్ చేస్తున్నారని, వారి అభిప్రాయాలు, రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించిన అంశాలను బీజేపీ అగ్ర నాయకుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. బీజేపీ నాయకులతో మరిన్ని సమావేశాల అనంతరం ఎవరు పోటీ చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందని పవన్ కల్యాణ్ వివరించారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.

మతం కంటే మానవత్వం ముఖ్యం..
తనకు మతం కంటే మానవత్వం ముఖ్యమని పవన్ కల్యాణ్ చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనారిటీలు తనకు దూరమౌతారని అనుకోవట్లేదని అన్నారు. పార్టీ విధానాలను ఆదరించే వారిలో అత్యధికులు ముస్లింలు, క్రైస్తవులే ఉన్నారని చెప్పారు. మానవత్వం ఎక్కడ అణచివేతకు గురవుతోందో అక్కడ తాను ఉంటానని పేర్కొన్నారు. అందుకే-ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి తాను అక్కడికి వెళ్లబోతోన్నానని చెప్పారు.

దేవాలయాలపై దాడులకు జగన్ స్పందించట్లేదు..
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలపై ఓ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆశించిన స్థాయిలో స్పందించట్లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన కేబినెట్ మంత్రులే దగ్గరుండీ మరీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని విమర్శించారు. మసీదులు, చర్చిలపై దాడులు చోటు చేసుకున్నప్పుడు గుండెలు బాదుకున్న వారు.. దేవాలయాలపై విధ్వంసకర ఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉంటున్నారని, అలాంటి కుహనా లౌకికవాదులకు వ్యతిరేకంగా మాత్రమే తాను పోరాడుతున్నానని అన్నారు.

అసెంబ్లీని ముట్టడిస్తాం..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాలను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నట్లు పీఏసీ సభ్యులు తెలిపారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ తాము వేర్వేరు రూపాల్లో నిరసన ప్రదర్శనలను తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్పదించట్లేదని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ సారి ఏకంగా అసెంబ్లీనే ముట్టడిస్తామని వారు ప్రకటించారు.