పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అమిత్ షా..తప్పని నిరాశ: మళ్లీ ఎదురుచూపులే: టూర్ క్యాన్సిల్
తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక గడువు ముంచుకొస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చేనెల 6వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం.. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల వేడి రాజుకుంటోన్న కొద్దీ.. ఈ రెండు పార్టీలు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేయబోతోన్నాయి. వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి, తెలుగుదేశం నుంచి కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి ఈ ఉప ఎన్నికలో పోటీలో ఉన్నారు.
బీజేపీతో తాడోపేడో: అమిత్ షాతో భేటీ: తిరుపతికి పవన్: కఠిన నిర్ణయాల దిశగా జనసేన

బీజేపీ-జనసేన మధ్య తేలని పోటీ వ్యవహారం..
వైఎస్సార్సీపీ, టీడీపీలకు భిన్నమైన పరిస్థితులు భారతీయ జనతాపార్టీ, దాని మిత్రపక్షం జనసేనల్లో నెలకొని ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది ఇంకా తేలనే లేదు. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలనేది ఖరారు కాలేదు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. బీజేపీ ఈ ఉప ఎన్నిక బరిలో దిగడం దాదాపు ఖాయమైనట్టే. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఆయా ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గ నేతలతో భేటీ అవుతున్నారు.

పవన్‌కు తప్పని నిరాశ..
ఈ పరిణామాల మధ్య ఈ నెల 4, 5 తేదీల్లో తిరుపతికి రానున్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను పవన్ కలవాల్సి ఉంది. ఈ మేరకు జనసేన అధినేత షెడ్యూల్ కూడా ఖరారైంది. 4వ తేదీ సాయంత్రం ఆయన అమిత్ షాను కలుసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనూహ్యంగా- అమిత్ షా పర్యటన రద్దయింది. సదరన్ కౌన్సిల్ జోనల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు కావడానికి తిరుపతికి రావాల్సిన అమిత్ షా.. తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమిత్ షా పర్యటన రద్దయినట్లు సమాచారం.

ముఖ్యమంత్రుల భేటీ సైతం
ఈ నెల 4, 5 తేదీల్లో తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన సదరన్ జోనల్ కౌన్సిల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాన్ని షెడ్యూల్ చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరు కావాల్సి ఉంది. దక్షిణాదిన రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరు కావడం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని చెబుతున్నారు. అందుకే ఈ భేటీతో పాటు అమిత్ షా పర్యటన కూడా రద్దయినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, తమినాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారం అందిందని అంటున్నారు.

పవన్‌కు దక్కని భరోసా
తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారంలో పవన్ కల్యాణ్‌కు బీజేపీ నుంచి ఎలాంటి భరోసా లభించట్లేదు. ఇదివరకు పవన్ కల్యాణ్.. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ఒకట్రెండు సమావేశాలు కొనసాగినప్పటికీ.. దీనిపై ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదు. ఇదే విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు గానీ భరోసా రాలేదు. ఫలితంగా- ఎవరు పోటీ చేయాలనే విషయంపై గందరగోళం కొనసాగుతోనే వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నందున.. దానికి పరిహారంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశాన్ని తమకు కల్పించాలంటూ పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తోన్నారు.