టీటీడీకి కేంద్రం షాక్: ఢిల్లీ చుట్టూ తిరిగినా రెన్యువల్ కాని లైసెన్స్; ఆగిన విదేశీ విరాళాలు
తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర హోంశాఖ ఇచ్చే విదేశీ విరాళాలకు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ చేయించకపోవడంతో విదేశీ విరాళాలు నిలిచిపోయాయని వెల్లడించింది. కేంద్రం కొత్తగా సవరించిన నిబంధనలకు అనుగుణంగా టిటిడి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్సుకు రెన్యువల్ దరఖాస్తు సకాలంలో చేసుకోలేకపోయింది. దీంతో టిటిడి దరఖాస్తును కేంద్రం ఎటూ తేల్చకుండా ఉంచింది. ఈ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే విరాళాలు భారీమొత్తంలో ఆగిపోయాయి.

రెన్యువల్ కాని టీటీడీ విదేశీ విరాళాల లైసెన్స్ .. నిలిచిపోయిన 50 కోట్ల విరాళాలు
2020- 2021 సంవత్సరానికి టిటిడికి విదేశీ విరాళాల రూపంలో ఒక్క రూపాయి కూడా అందని పరిస్థితి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం 2020 చివర్లోనే లైసెన్స్ రెన్యువల్ కోసం అప్లై చేసినప్పటికీ కొత్త నిబంధనలపై సరిగా దృష్టి సారించకపోవడంతో లైసెన్స్ రెన్యువల్ కాలేదు. దీంతో 50కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు దృష్టిసారించి అనేకమార్లు ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారు. కొత్తగా సవరించిన నిబంధనల మేరకు అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్లను అందజేశారు. కానీ ఇప్పటివరకు లైసెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఆర్ధిక ఇబ్బందుల్లో టీటీడీ.. విరాళాల కోసం టీటీడీ తిప్పలు
ఇప్పటికి కూడా ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో విదేశాల నుండి టీడీపీకి రావాల్సిన విరాళాలు నిలిచిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా వస్తున్న ఆదాయం భారీగా పడిపోయింది. ఇటు విదేశాల నుంచి వస్తున్న విరాళాలు కూడా రాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 2021 సంవత్సరానికి ఎటువంటి విదేశీ విరాళాలు అందకపోవడంతో టీటీడీ ఆ విరాళాల కోసం ప్రయత్నం చేస్తోంది.

లైసెన్స్ విషయంలో కేంద్రం ఇవ్వని స్పష్టత
ఇదిలా ఉంటే 2022 సంవత్సరానికి కూడా టీటీడీ కి లైసెన్స్ రాలేదు.ఇప్పటికి రాకుండా ఆగిపోయిన 50 కోట్ల రూపాయల విరాళాల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం టిటిడి ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన టిటిడి ఆర్థిక వ్యవస్థకు కేంద్రం విదేశీ విరాళాలు అందేలా లైసెన్స్ రెన్యువల్ చేసే కాస్త ఉపశమనం దక్కే పరిస్థితి కనిపిస్తుంది.

విదేశీ విరాళాల కోసం కేంద్ర హోం శాఖ లైసెన్స్ తప్పనిసరి
విదేశాల నుండి ఏదైనా సంస్థ విరాళాలు పొందాలంటే కేంద్ర హోం శాఖ అందించే లైసెన్సు పొందాల్సి ఉంటుంది. దీనిని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది. కానీ ఈ లైసెన్సును టిటిడి ఏడాదిగా రెన్యువల్ చేయించలేదు. గతంలో యూపీఏ హయాంలో ఇటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోకున్నా, ప్రస్తుత ఎన్డీఏ హయాంలో మాత్రం నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో విదేశాల నుంచి వస్తున్న విరాళాలు సేకరిస్తున్న పలు సంస్థలు, విరాళాలను దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్రం కఠినంగా వ్యవహరించడంతో అనేక సంస్థలు తన లైసెన్సులను రెన్యువల్ చేసుకోని పరిస్థితి ఉంది. దీంతో గత కొన్ని ఏళ్లుగా చాలా సంస్థలు విదేశీ విరాళాలను పొందలేని పరిస్థితి ఉంది.