2 లక్షల మంది ఫెయిల్.. సీబీఐ చేత ఎంక్వైరీ: కొల్లు రవీంద్ర
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడం వారి సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తావించారు. ఫలితాలు ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఫలితాలను ప్రకటిస్తామనే రోజు కాకుండా, మూడు రోజుల ఆలస్యంగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఏదైనా లోపాయికారిగా జరిగి ఉండొచ్చు కదా అని సందేహాం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందనే అనుమానం కలుగుతోందని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని ఆయన సూచించారు. వారి తరపున తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పారు. టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు.

పదో తరగతి పరీక్షలకు 6.15 లక్షల మంది హాజరుకాగా, 4.14 లక్షల మంది పాస్ అయిన సంగతి తెలిసిందే. 2.02 లక్షల మంది బాలురు, 2.11 లక్షల మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు పాసయ్యారు. మొత్తంగా 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా 78.30 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 49.70 శాతంతో అనంతపురం చివరి స్థానంలో ఉంది. 797 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత ఉంది. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. దీనిపై కొల్లు రవీంద్ర అనుమానం వ్యక్తం చేశారు.