andhra pradesh vijayawada kanakadurga temple acb raids acb employees suspension corruption ap govt కనకదుర్గ గుడి ఏసీబీ ఉద్యోగులు అవినీతి ఏపీ ప్రభుత్వం
కనకదుర్గ గుడిలో కలకలం-13 మంది ఉద్యోగుల సస్పెన్షన్- ఏసీబీ సోదాల్లో దొరికిన వైనం
అక్రమాల పుట్టగా మారిన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మూడు రోజులుగా ఏసీబీ నిర్వహించిన సోదాలు ముగిశాయి. గుడిలోని పలు విభాగాల్లో ఏసీబీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. అవినీతి మూలాలను గుర్తించింది. వీటి ఆధారంగా 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
విజయవాడ దుర్గమ్మ గుడిలో కొన్నేళ్లుగా భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు ఇక్కడి పాలకమండళ్లు, అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుడిని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నాలు చేసినా పూర్తి స్ధాయిలో ఫలించలేదు. తాజాగా రెండు నెలల క్రితం ఏకంగా అమ్మవారి రథంపై వెండి సింహాలు సైతం మాయమయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు విగ్రహాల దొంగలు ఎత్తుకెళ్లి వాటిని కరిగించేశారని తేలింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది.

మూడు రోజులుగా గుడిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక అంశాలను గుర్తించారు. దర్శన టికెట్ల విక్రయాలు, చీరలు, ఫొటోల విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే స్టోర్ కీపింగ్, అన్నదానం, షాపుల లీజు, సూపర్ వైజింగ్, ప్రసాదాల విభాగాల్లో సైతం భారీగా అక్రమాలు తేలాయి. దీంతో మొత్తం ఏడు విభాగాల్లోని 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇంత పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ ఉద్యోగులపై వేటు పడటం ఇదే తొలిసారి.