మంత్రి పేర్ని నానీపై హత్యాయత్నంతో మంత్రి కొడాలి నానీకి భారీ భద్రత.. మాజీ మంత్రికి నోటీసులు
సమాచార మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పై జరిగిన దాడి టిడిపి కుట్ర అని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని పై దాడికి పాల్పడిన నాగేశ్వర్ రావు తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడని, ప్రభుత్వ తీరు వల్ల అది అతని జీవన స్థితి ఇబ్బందుల్లో పడడంతో దాడికి పాల్పడి ఉండవచ్చని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇదంతా టిడిపి నేతలు కావాలని చేసిన కుట్రగా మండిపడుతున్నారు.
టీడీపీ హయాంలో పథకాలన్నీ పక్క రాష్ట్రాల నుండి కాపీ కొట్టినవే..కానీ జగన్ అలా కాదు:మంత్రి పేర్ని నాని

పేర్ని నానీ హత్యాయత్నం .. పోలీసుల కస్టడీల పోలీసులు .. మాజీ మంత్రికి నోటీసులు
ఈ కేసులో దూకుడు పెంచిన పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడు బడుగు నాగేశ్వర్ రావును మచిలీపట్నం జైలు నుండి తిరిగి కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజులపాటు నాగేశ్వరరావు ను విచారించనున్న పోలీసులు అతని మొబైల్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. నిందితుడికి రెగ్యులర్ గా టచ్ లో ఉన్న టీడీపీ నేతలతో పాటు, అతని సోదరిని కూడా విచారించారు.
ఇక హత్యాయత్నం పై నిరాధారమైన విషయాలతో కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేసినందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు సెక్షన్ 91 కింద నోటీసులు పంపారు.

ఆధారాలతో పాటు విచారణకు హాజరు కావాలని రవీంద్రకు నోటీసుల జారీ .. గతంలోనూ కేసు
కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలపై ఆధారాలతో పాటు విచారణకు హాజరు కావాలని నోటీసుల ద్వారా పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న నాగేశ్వరరావు విచారణలో వెల్లడించే అంశాలను బట్టి ఈ కేసులో పోలీసులు ముందు ముందు నిర్ణయాలు తీసుకోనున్నారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైసిపి మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు మోకా భాస్కర్ రావు హత్యకేసులో కూడా టిడిపి నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే . ఆయనపై 109 సెక్షన్ కింద కేసు నమోదు అయింది. ఇప్పుడు పేర్ని నానిపై హత్యాయత్నం ఘటనలో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి .

మంత్రి కొడాలి నానీకి భారీ భద్రత .. పేర్ని నానీపై హత్యాయత్నం ఎఫెక్ట్
ఇదే సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు జిల్లాలోని మంత్రుల నివాసం, కార్యాలయాల్లో అదనపు భద్రతా చర్యలను చేపట్టారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి అదనపు భద్రతను కల్పిస్తున్నారు. గుడివాడ లోని ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మెటల్ డిటెక్టర్ , డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేసి, మంత్రి నివాసాన్ని డాగ్స్ స్క్వాడ్ తో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. సందర్శకులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే మంత్రి నివాసంలోకి అనుమతిస్తున్నారు.