Vasireddy Padma: తమిళ నటుడు భాగ్యరాజాపై భగ్గుమన్న వాసిరెడ్డి పద్మ: మహిళా కమిషన్ తరఫున..!
అమరావతి: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కే భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. మహిళల వ్యక్తిత్వాన్నిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చేసిన వివాదాస్పద కామెంట్లపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం స్పందించారు. ఆయనను బహిరంగంగా చెప్పులతో కొట్టాలని అన్నారు.
అయోధ్య తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు సంచలనం: డిసెంబర్ మొదటివారంలో..!

భాగ్యరాజా ఏం చెప్పారు?
భాగ్యారాజా చేసిన కామెంట్లు అల్లాటప్పావేమీ కావు. మహిళలను కించ పరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు తమిళనాడులో వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలకు పరోక్షంగా మహిళలే కారణమని ఆయన అన్నారు. మహిళల ప్రవర్తన, వైఖరి, నడవడిక.. ఇవన్నీ వారిపై అత్యాచారాలకు ప్రోత్సహించేలా చేస్తున్నాయని దుమారాన్ని రేపారు. సోమవారం ఓ సినిమా ఆడియా ఫంక్షన్ కు హాజరైన ఆయన మహిళల పట్ల ఇలా షాకింగ్ కామెంట్స్ చేశారు.

కట్టుబాట్లను పక్కన పెట్టి.. ఇష్టానుసారంగా..
మహిళలు సభ్య సమాజంలో కట్టుబాట్లకు తిలోదకాలు ఇచ్చేశారని భాగ్యరాజా అన్నారు. తమ పరిధులను దాటుతున్నారని, హద్దులు మీరుతున్నారని చెప్పారు. ఒక సెల్ ఫోన్ లో రెండు సిమ్ కార్డులను వినియోగిస్తున్నారంటూ వివాహ వ్యవస్థను సైతం కించ పరిచేలా భాగ్యరాజా వ్యాఖ్యానించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హద్దులు దాటడం వల్లే మహిళలు అత్యాచారాల బారిన పడుతున్నారని, ఇందులో మగవారి తప్పు చాలా స్వల్పమేనని అన్నారు.

అల్పబుద్ధిని బయట పెట్టుకున్న భాగ్యరాజా
భాగ్యారాజా చేసిన వ్యాఖ్యలపై అటు తమిళనాడులో, ఇటు ఏపీలో విమర్శలు చెలరేగుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ మహిళా కమిషన్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం స్పందించారు. భాగ్యరాజా తన అల్పబుద్ధిని బయట పెట్టుకున్నారని విమర్శించారు. చివరికి అత్యాచార ఘటనల్లో మహిళలనే తప్పు పట్టాడని అన్నారు. మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడితే వారు చూస్తూ కూర్చోబోరని, చెప్పుతో కొట్టి సన్మానిస్తారని అన్నారు.
తమిళనాడు మహిళా కమిషన్ కు లేఖ..
భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ తమిళనాడు మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాగ్యారాజా వంటి ప్రముఖులు చేసే వ్యాఖ్యలకు సంబంధించిన తీవ్రత అధికంగా ఉంటుందని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం వల్ల సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని చెప్పారు. మహిళలను కించ పరుస్తూ ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖులైనా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా.. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాబోవని అన్నారు.