చంద్రబాబు మెడకు ఉచ్చుబిగిస్తూ.. అసెంబ్లీలో కీలక తీర్మానం.. విప్ కాపు ‘దొంగ అల్లుడి‘ పిట్టకథ
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ సర్కారు మరో అడుగువేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై సమగ్ర విచారణకు సంబంధించి బుధవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది.రైతు భరోసా పథకంపై సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే హోం మంత్రి మేకతోటి సుచరిత 'ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ' తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ సూచించిన సవరణతోపాటు విచారణ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. లోకాయుక్తతో విచారణ జరిపిస్తారని వార్తలు వచ్చినా, తీర్మానంలో విచారణ సంస్థ పేరును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.

తీర్మానంలో ఏముందంటే..
‘‘రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో తీసుకున్న విధానపరమైన, పరిపాలన పరమైన కీలక నిర్ణయాలను పున:సమీక్ష చేసేందుకు.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఓ సబ్ కమిటీ వేశారు. 2019, జూన్ 26న ఏర్పాటైన ఆ సబ్ కమిటీ.. జీవో 1411 ద్వారా గత ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించింది. రాజధాని ప్రకటనకు ముందు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు వెల్లడైంది. అప్పటి సీఎం చంద్రబాబు తన అనుకూల వర్గాలకు లబ్ది చేసేలా ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారని, తద్వారా పెద్ద ఎత్తున భూఅక్రమాలు జరిగాయని, మంత్రుల కమిటీ గుర్తించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్న ప్రభుత్వం ఉద్దేశం మేరకు ఈ తీర్మానం దాఖలైంది. విచారణ సంస్థ ఇచ్చే రిపోర్టును బట్టి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది'' అని తీర్మానంలో పేర్కొన్నారు.

నలుగురితోనే ముగిసిన చర్చ..
ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో ఇదివరకే సుదీర్ఘ చర్చలు జరిగాయని, కాబట్టి దానిపై విచారణకు ఆదేశించేలా తీర్మానం ఆమోదిస్తే సరిపోతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఆయనతోపాటు చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి, మంత్రి కన్నబాబు, మరో ఎమ్మెల్యే మాత్రమే 'ఇన్ సైడర్‘ తీర్మానంపై మాట్లాడారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం పాస్ అయినట్లు డిప్యూటీ స్పీకర్ రఘుపతి ప్రకటించారు.

పిట్టకథతో ఆకట్టుకున్న కాపు
‘ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ‘ తీర్మానంపై చర్చ సందర్భంగా చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి చెప్పిన పిట్టకథ విని సీఎం జగన్ తోపాటు అధికార పక్షమంతా నవ్వుల్లో మునిగిపోయింది. ‘‘ఒక రాజు తన అల్లుడికి ఖజానా బాధ్యతలు అప్పగిస్తాడు. అవినీతిపరుడైన ఆ అల్లుడు అక్రమాలకు పాల్పడుతాడు. శిక్షవేయాలనుకునేలోపే.. కూతురొచ్చి వేడుకోవడంతో అల్లుడి శాఖ మారుతుంది. ఆరోగ్య శాఖ, రక్షణ శాఖలోనూ వాడి అక్రమాలకు అంతుండదు. విసిగిపోయిన రాజు.. చివరికి తన అల్లుడికి సముద్రపు అలలు లెక్కపెట్టే ఉద్యోగంలో నియమిస్తాడు. అప్పుడు కూడా ఆ అల్లుడు సముద్రంలో తిరిగే పడవలు, జాలర్ల నుంచి డబ్బులు గుంజుతాడు. కథలో అల్లుడిలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడెక్కడ అవినీతి చెయ్యొచ్చో వెతికిమరీ పట్టుకుంటారు. ఆ క్రిమినల్ బుద్ధితోనే రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిమరీ రహస్యాలను లీక్ చేశారు''అని కాపు తన కథను ముగించారు.

చంద్రబాబు ఓ లీకు వీరుడు..
గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్ష చేసేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీలో తాను కూడా సభ్యుడినేనన్న మంత్రి కన్నబాబు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని, అందుకే ప్రభుత్వం తీర్మానాన్ని పెట్టిందని చెప్పారు. ‘‘తనకు అనుకూలంగా ఉండేవాళ్లకు అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారు. నిజానికి ఆయనో పెద్ద లీకు వీరుడు. అప్పటి గ్రీకువీరుల్లాగా బాబు పేరును చరిత్రలో రాసుకోవచ్చు. ల్యాండ్ పూలింగ్ లో పదుల కొద్దీ చట్టాలను తుంగలో తొక్కారు''అని ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సూచించిన ‘బినామి ప్రొహిబీషన్ యాక్ట్ పరిశీలన‘ను కూడా స్వీకరిస్తూ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.