రాజధానిపై భిన్న గళం వినిపిస్తోన్న వేళ.. పవన్‌తో సోము వీర్రాజు భేటీ: ఆ ఓటుబ్యాంకుకు గాలం?
అమరావతి/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు దూకుడు వైఖరిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఆయన ఆ మరుసటి రోజే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ కార్యాలయంలో కొద్దిసేపటి కిందట ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ భేటీ మర్యాదపూరకమే అయినప్పటికీ.. సోము వీర్రాజు ఉద్దేశమేమిటనేది చెప్పకనే చెప్పినట్టయిందని అంటున్నారు. భవిష్యత్తులో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందనడానికి ఈ భేటీ ఓ స్పష్టత ఇచ్చిందని చెబుతున్నారు.

రాజకీయ పరిస్థితులపై
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, చోటు చేసుకుంటోన్న పరిణామాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయని చెబుతున్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు.. కేంద్రం వైఖరి.. బీజేపీ నేతల్లో ఉన్న స్పష్టత.. వంటి పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని తెలుస్తోంది. మూడు రాజధానులపై బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుసరించిన విధానాలు సైతం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ భిన్న గళం...
మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై పవన్ కల్యాణ్ కొంతకాలంగా భిన్న గళాన్ని వినిపిస్తోన్న విషయం తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేయడమనేది కలే అవుతుందంటూ ఆయన బాహటంగా తన అభిప్రాయాన్ని వినిపించారు. అమరావతి ప్రాంత రైతులకు తాము అండగా ఉంటామని, వారి పోరాటానికి సహకరిస్తామనీ తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడం వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నస్టపోతారంటూ పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. మిత్రపార్టీ బీజేపీ చేస్తోన్న ప్రకటనలతో పోల్చుకుంటే ఇది భిన్నం.

బీజేపీ అలా.. పొత్తు పార్టీ ఇలా..
రాష్ట్రంలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నాయి. అదే సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై ఈ రెండు పార్టీల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, ఈ వ్యవహారంలో కేంద్రానికీ ఎలాంటి సంబంధం లేదని సోము వీర్రాజు కుండబద్దలు కొట్టారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలనే డిామాండ్‌ను ఆయన గట్టిగా వినిపిస్తున్నారే తప్ప మూడు రాజధానుల ఏర్పాటును ఎక్కడా వ్యతిరేకించట్లేదు.

ఆ వర్గ ఓటు బ్యాంకుపైనా..
అటు మెగాస్టార్ చిరంజీవి.. ఇటు పవన్ కల్యాణ్‌తో బ్యాక్ అండ్ బ్యాక్‌గా సోము వీర్రాజు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకును బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేయడానికి సోము వీర్రాజు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాపు సామాజిక వర్గం బలమైన ఓటుబ్యాంకుగా ఉంటోంది. ఇందులో అధికశాతం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. ఈ ఓటు బ్యాంకును బీజేపీ-జనసేన వైపు ఆకర్షించడంలో భాగంగా దీన్ని అభివర్ణించవచ్చని చెబుతున్నారు.