హైకోర్టు వ్యాఖ్యలపై సజ్జల అభ్యంతరం- కామెంట్స్ బాధాకరం- మీడియానే చిచ్చుపెడుతోందని ఆక్షేపణ
ఏపీ హైకోర్టుకూ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తోందంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతుండగా.. ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై నిన్న హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్ధపై విశ్వాసం లేకపోతే హైకోర్టు తీసేయాలని కేంద్రాన్ని కోరమంటూ వైసీపీ ప్రభుత్వానికి న్యాయస్ధానం చేసిన సూచన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టు వ్యాఖ్యలపై ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు మూసేయమనండి అంటూ పత్రికల్లో వచ్చిన హైకోర్టు వ్యాఖ్యల కవరేజీపైనా ఆయన మండిపడ్డారు. ప్రతీ వ్యవస్ధ తాము ఆత్మ నిగ్రహం పాటించడంతో పాటు పక్క వ్యవస్ధలనూ గౌరవించాలని, లేదంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని సజ్జల హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు. రాజకీయ వ్యవస్ధ బావుందని తాము చెప్పడం లేదని, అలాగని మిగతా వ్యవస్ధలు బాగున్నాయని చెప్పలేమన్నారు. ఇలాంటి కామెంట్స్ చేయాలనుకుంటే రికార్డ్ చేసే తీర్పులో భాగం చేయాలన్నారు. అప్పుడు తాము స్పందించడానికి అవకాశం ఉంటుందన్నారు.

అన్ని సమస్యలను తీర్చాల్సిన న్యాయవ్యవస్ధ నుంచి ఓ కామెంట్ వస్తే ఏం చేయాలని సజ్జల ప్రశ్నించారు. చిన్న సంఘటనలను రాష్ట్రం మొత్తం ఆపాదించడం బాధాకరమన్నారు. పోలీసు వ్యవస్ధను గతంతో పోలిస్తే ఎంతో మారిందని, ఇలాంటి సమయంలో అసలు పోలీసు వ్యవస్ధ ఉందా ? దాన్ని నియంత్రిస్తున్న ప్రభుత్వం ఉందా అంటూ హైకోర్టు చేస్తున్న కామెంట్స్ బాధ కలిగిస్తున్నాయన్నారు. లక్ష కేసుల్లో ఎక్కడో చిన్న తప్పు జరిగితే రాజ్యాంగం దెబ్బతింది అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని సజ్జల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నా పక్కవారి స్వేచ్ఛ దెబ్బతీయలేమని, దానికి సంబంధించి చట్టాలు కూడా లేవన్నారు.
సోషల్ మీడియా బాధితుల్లో వైసీపీ అగ్రస్ధానంలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరన్నా కామెంట్ చేసినా సీఎం జగన్ వదిలేయమంటున్నారని, కానీ అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం ఎప్పటికైనా మంచిదే అన్నారు. ఇలాంటి విషయాల్లో నేరుగా వ్యవస్ధపై కామెంట్ చేయడం ఇబ్బందికరమన్నారు. మొత్తం ప్రభుత్వమే దానికి కారణం అనడమేంటన్నారు. సీఎంపై, వ్యవస్ధపై చేస్తున్న కామెంట్స్ కూడా రాజ్యాంగ ఉల్లంఘనే కదా అని సజ్జల అన్నారు. మీడియా ద్వారా రెండు రాజ్యాంగ వ్యవస్ధల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందని న్యాయస్ధానాలు, న్యాయమూర్తులు గుర్తించాలన్నారు.