ఏపీలో మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ- రాష్ట్రవ్యాప్తంగా 2434కు పెరిగిన వైద్య చికిత్సలు
ఆరోగ్యశ్రీ పథకంలో 2434 వైద్య ప్రక్రియలను రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాలకు విస్తరించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే ఏడు జిల్లాల్లో 2200 వ్యాధులకు వర్తింపచేస్తుండగా, కొత్తగా మరో 234 చికిత్సలను చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 2434 వ్యాధులకు చికిత్స అందుబాటులోకి వచ్చింది. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయగా, ఆ తర్వాత ఆరు జిల్లాలలో అమలు చేశారు. ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కూడా విస్తరించారు.
ఆరోగ్యశ్రీలో 2434 చికిత్సలను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపచేస్తున్న సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఇది మరో జన్మ ఇచ్చే పథకం. ఆస్తులు అమ్ముకునే అవసరం లేకుండా, నిరుపేదలు, నిస్సహాయులకు కూడా తన ఖర్చుతో ప్రభుత్వమే వైద్యం చేయించే పథకం.
- అటువంటి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగు అడుగులు వేసి మరింత గొప్పగా మార్చుకున్నాం.

అందుకే ఇతర పథకాలకు భిన్నంగా ఈ పథకాన్ని చూడాలి.
- ఈ పథకం అమలు చేసేటప్పుడు మనసు బాగుండాలి, ప్రతి అధికారి దీన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి.
- గతంలో ఎప్పడూ లేని విధంగా పథకం అమలు దిశలో అడుగులు వేశాం.
- ఈ 17 నెలల్లోనే, కోవిడ్ కష్టకాలంలోనే ఆర్థికంగా కనీవినీ ఎరగని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ వైద్య ఆరోగ్య రంగం మీద ఎంతటి మమకారంతో ఎన్ని అడుగులు వేశామో అందరికి తెలుసు.
- అందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకంలో అంటే ప్రభుత్వమే చేయించే ఉచిత వైద్యంలో 2434 చికిత్సలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి వర్తింపజేశామన్నారు. దీని వల్ల దాదాపు 95 శాతం కుటుంబాలకు పథకం వర్తిస్తోందన్నారు. రూ.1000 వైద్య ఖర్చు దాటితే చాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ యాప్ తెలుగు, ఇంగ్లిషు వెర్షన్ను సీఎం జగన్ ఆవిష్కరించారు.ఆరోగ్యశ్రీ లబ్ధిదారులంతా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని తమ హెల్త్ రికార్డులు పరిశీలించుకోవాలని సీఎం శ్రీ వైయస్.జగన్ అన్నారు.

గూగుల్ ప్లే స్టోర్లో యాప్
ప్రతిఒక్కరికీ సులువుగా అర్ధమయ్యేలా యాప్ రూపకల్పన
చేయడంతో పాటు పథకంలో ఎవరు, ఎక్కడ చికిత్స పొందినా యాప్లో పూర్తి సమాచారం, అందుబాటులో వారి హెల్త్ రికార్డులు
ఉండే ఏర్పాట్లు చేశారు. ఇందులోనే హెల్త్ రికార్డులను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం
కల్పించారు. యాప్లో కోవిడ్ చికిత్స పైనా పూర్తి సమాచారం
ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల జాబితా, వాటి చిరునామా, ఫోన్ నంబర్లు, కోఆర్డినేటర్ల వివరాలు, ఆయా ఆస్పత్లుల్లో అందుబాటులో ఉన్న చికిత్సల వివరాలు ఇస్తున్నారు.