ఏపీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడంటే..హైకోర్టులో కీలక పరిణామాలు, కేంద్రానికి సైతం సమాచారం
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగవా...? మే నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి విశాఖ నుంచి పాలనా ప్రారంభించాలని ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి తాజా పరిణామాలు అడ్డుగా మారుతున్నాయి. ఒకవైపు కరోనా కల్లోలం కొనసాగుతున్న సమయంలోనే ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డను తప్పించి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును ఆస్థానంలో నియమించింది. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా తనను తొలగించిందని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తమ నిర్ణయానికి ముందు జరిగిన పరిణామాలు తమ ఆలోచనలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచింది. దీనికి వెంటనే నిమ్మగడ్డ కోర్టు ముందు ప్రభుత్వ అఫిడవిట్‌కు సమాధానమిస్తూ వివరణ పత్రం దాఖలు చేశారు. దీనిపైన సోమవారం విచారణ చేసిన హైకోర్టు పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది.

తెరమీదకు కొత్త వాదన తెచ్చిన నిమ్మగడ్డ న్యాయవాది
కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది రెండు వారాల సమయం కోరగా 24వ తేదీ వరకు కోర్టు సమయం ఇచ్చింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ తరపు న్యాయవాది కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. రాత్రికి రాత్రి కొత్త ఎన్నికల కమిషనర్‌ను చెన్నై నుంచి రప్పించిన ప్రభుత్వానికి అఫిడవిట్ దాఖలు చేసేందుకు అంత సమయం ఎందుకని కోర్టులో వాదించారు. ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఏ అధికరణతో ప్రభుత్వం నిమ్మగడ్డను నియమించిందో ఆ మేరకు ఐదేళ్ల పదవీకాలం లేక 65 ఏళ్ల వయస్సు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు ముందు నివేదించారు. అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించలేరని తాము కేంద్రానికి సైతం రెండు సార్లు లేఖల ద్వారా సమాచారం ఇచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు నో ఛాన్స్..?
ఎన్నికల సంస్కరణలో భాగంగానే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎన్నికల కమిషనర్‌గా నియమించామని కోర్టుకు నివేదించింది. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసేందుకు కోర్టు సమయం ఇవ్వటాన్ని ప్రశ్నించిన నిమ్మగడ్డ తరపు న్యాయవాది అప్పటివరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి స్పందనగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే కరోనా తీవ్రతను జిల్లాల వారీగా కాకుండా మండలాల వారీగా ప్రకటిస్తూ పరోక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అడుగులు పడేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.

28న తీర్పు ప్రభుత్వానికి కీలకం
అదే విధంగా మే నెల చివరివారంలో పరిపాలన సౌలభ్యం పేరుతో విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపుకు సూత్రప్రాయ నిర్ణయం జరిగింది. అయితే ఎన్నికల సంఘం పై ఏర్పడిన వివాదంలో కోర్టు తీర్పు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈనెల 28కి జడ్జిమెంట్ వాయిదా పడటంతో ఆరోజున వచ్చే తీర్పు ప్రభుత్వంలో చోటుచేసుకునే తదుపరి పరిణామాలకు కీలకం కానుంది.