andhra pradesh nimmagadda ramesh kumar kodali nani comments controversy apology ap govt కొడాలి నాని వ్యాఖ్యలు వివాదం క్షమాపణ ఏపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ
కొడాలి కామెంట్స్‌పై నిమ్మగడ్డ సీరియస్- రెచ్చగొట్టే వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు- వివరణకు డెడ్‌లైన్
ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదంలో ఇరుక్కున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఈసీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం ప్రెస్మీట్లో మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో పాటు ఎన్నికల కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ సీరియస్ అయ్యారు. మంత్రిగా ఉన్న కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు కమిషన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, కమిషనర్ నిమ్మగడ్డకు రాజకీయాలు ఆపాదించేలా ఉన్నాయని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. కొడాలి వ్యాఖ్యల వెనుక ఇతర దురుద్ధేశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని ఇందులో తెలిపారు.

కొడాలి నాని ప్రెస్‌మీట్ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని కమిషన్ భావిస్తున్నట్లు ఆయనకు పంపిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిపై మంత్రి కొడాలి నాని తక్షణం వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. దీంతో పాటు కమిషన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము సంతృప్తి చెందే విధంగా బహిరంగంగా స్పందించాలని ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోగా కొడాలి నాని తన వ్యాఖ్యలపై కమిషన్‌కు వివరణ ఇవ్వాలని, తాను ఇవ్వలేకపోతే తన ప్రతినిధితో వివరణ పంపాలని సూచించారు. మంత్రి స్పందించకపోతే కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.