ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ .. మల్లవల్లిలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం .. వర్గపోరులో భాగమే
కృష్ణాజిల్లా గన్నవరంలో వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చారు మల్లవల్లి గ్రామస్తులు . అయితే వైసీపీలో వర్గ విభేదాల కారణంగానే ఇది చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది . గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు తెలిపిన నాటి నుండి అడుగడుగునా వైసీపీ శ్రేణుల్లో వల్లభనేని వంశీపై వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది ఇది వంశీకి గన్నవరం నియోజకవర్గంలో పెద్ద తలనొప్పిగా తయారైంది.
పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? వల్లభనేని వంశీ సూటి ప్రశ్న

వల్లభనేనికి మల్లవల్లి గ్రామస్తుల నిరసన .. వెనుదిరిగి వెళ్ళిపోయిన వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 3 రోజులుగా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు . ఇళ్ల పట్టాల పంపిణీ కి వచ్చిన ఎమ్మెల్యే వంశీ ని వెనక్కి వెళ్లాలి అంటూ నినాదాలు చేసిన గ్రామస్తుల తీరుతో వల్లభనేని వంశీ మోహన్ వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది

ఇళ్ళ పట్టాల పంపిణీ చెయ్యకుండా అడ్డుకున్న వైసీపీలోని ఒక వర్గం
మల్లవల్లి గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు వంశి వేదిక వద్దకు వెళ్లకుండా వైసిపి లోని ఒక వర్గం అడ్డుకుందని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు . మల్లవల్లి గ్రామంలో ఈరోజు వల్లభనేని వంశీ అనుకూల వ్యతిరేక వర్గాల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్నవరం నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా సరే వైసీపీలో వర్గ పోరు కు వేదికగా మారుతూ ఉండడం గమనార్హం.

ఇటీవల కేసరపల్లి గ్రామంలోనూ ఘర్షణ .. రాళ్ళతో కొట్టుకున్న వైసీపీ శ్రేణులు
గన్నవరం మండలం కేసరపల్లి లో ఇటీవల వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది . స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వర్గానికి డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాలకు మధ్య మొదటినుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల కేసరపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన వల్లభనేని వంశీ ఎదుటే ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగారు. రాళ్ళతో దాడులకు పాల్పడ్డారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

వైసీపీలో అడుగడుగునా వంశీకి ఇబ్బందులు .. అవమానాలు
టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ ఆ తర్వాత వైసీపీకి తన మద్దతును ప్రకటించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడం తెలిసిందే. అయితే మొదటి నుంచి గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీ వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్ర రావు వర్గాలు వల్లభనేని వంశీ అంటే మండిపడుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ వంశీ పరిస్థితి వైసీపీ లోకి వచ్చిన తర్వాత అగమ్యగోచరంగా తయారైంది. అడుగడుగునా ఆటంకాలతో , చేదు అనుభవాలతో ఇబ్బందికరంగా మారింది.