గవర్నర్‌తో బీజేపీ-జనసేన నేతల భేటీ- గతానుభవాలు రిపీట్ కానివ్వొద్దని వినతి
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికీ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కూ మధ్య జరుగుతున్న ముఖాముఖీ పోరుపై బీజేపీ-జనసేన నేతలు ఇవాళ గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన బీజేపీ-జనసేన నేతలు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్, ఇతరులు తాజా పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలోస్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు.
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
గవర్నర్‌తో భేటీ అనంతరం మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్ధానిక ఎన్నికల్లో అధికార పార్టీ గతంలో అరాచకాలకు పాల్పడిందని, ఈసారి అలా జరగకూడదని గవర్నర్‌ను కోరామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్లు సోము తెలిపారు. ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సోము మరోసారి ఆరోపించారు. సిట్ వేసి విచారణ వేగవంతం చేయలేకపోయిన ప్రభుత్వం, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలను దోషులుగా చూపుతూ అక్రమ కేసులు పెట్టిందన్నారు. ప్రజాఉద్యమానికి పిలుపిస్తే హౌస్ అరెస్టులు చేస్తోందన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలను ప్రభుత్వం రెచ్చగొడుతోందన్నారు. చర్చి ఫాదర్లకు ప్రజాధనం ఎందుకు పంచుతున్నారని సోము ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ విధానం అమలు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.

జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్దితులు గవర్నర్‌కు వివరించామన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీకి ఉందని, ఈసారి అలాంటి పరిస్ధితుల తలెత్తకుండా చూడాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఏకగ్రీవాలు సహజమే అయినా ప్రలోభపెట్టి, భయపెట్టాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. తుపాను బాధిత రైతులకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించకపోవడం, ఆలయాల దాడులు వంటి అంశాలను సైతం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు పూర్తిగా సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు.