రాజధానిపై త్వరలో సీఎం జగన్ ప్రకటన : బొత్సా స్పష్టీకరణ
రాజధాని అంశం పై రగడ కొనసాగుతున్న వేళ మరోమారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశం పై మాట్లాడారు. త్వరలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశం పై ప్రకటన చేస్తారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై చేసిన కీలక వ్యాఖ్యలతో మరికొద్ది రోజుల్లో రాజధాని పై క్లారిటీ వస్తుందనే భావన వ్యక్తమవుతోంది.

నిపుణుల కమిటీ నివేదిక తర్వాత రాజధానిపై ప్రకటన అన్న మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాజధానిని ప్రకటిస్తుందని పేర్కొన్న బొత్స నిపుణుల కమిటీ నివేదిక తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తోందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నుంచి నివేదిక వచ్చాక రాష్ట్ర రాజధానిపై ప్రకటన ఉంటుందని చెప్పిన మంత్రి, టీడీపీ నేతల బృందం రాజధాని పర్యటన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణం కోసం రూ.5,400 కోట్లు ఖర్చయిందని, 90 శాతం పనులు పూర్తయినట్టు ఏ నిపుణుడినైనా చెప్పమనండి అంటూ బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.

ఆరువారాల్లో నిపుణుల కమిటీ నివేదిక
నిపుణుల కమిటీకి ఆరు వారాల సమయం ఇచ్చారని, ఇప్పటికే నిపుణుల కమిటీ రెండు మూడు జిల్లాల్లో పర్యటించారని పేర్కొన్న బొత్స రాజధాని మీద ప్రతిపక్షాలదే అనవసర రాద్ధాంతం అని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ 13 జిల్లాల పర్యటన తర్వాత వారి అభిప్రాయాల ఆధారంగా రాజధాని పై సీఎం జగన్ ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. రాజధానిపై ప్రతిపక్షాలవి అనవసర రాద్దాంతం అన్నారు.
ఏపీలో మూడు పార్టీలాట: రాజధాని రగడ.. హైకోర్టు పంచాయితీతో రాజకీయ మంటలు

రాజధాని వికేంద్రీకరణ చేస్తారా అన్న అనుమానాలు
ఎమ్మెల్యేల భవనాలు 67 శాతం పూర్తయ్యాయని, ఐఏఎస్ అధికారుల భవనాలు 26 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు, ఐఏఎస్ అధికారుల భవనాలు మినహా మిగతావన్నీ తాత్కాలిక భవనాలేనని బొత్స పేర్కొన్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో రాజధాని అంశం పై ఒక క్లారిటీ రానుందని బొత్స వ్యాఖ్యలతో అర్థమవుతుంది. అయితే రాజధాని వికేంద్రీకరణ విషయంలో మాత్రం ప్రజల్లో ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి.

అధికార పార్టీపై మూకుమ్మడి దాడి చేస్తున్న ప్రతిపక్షాలు
ఇప్పటికీ రాజధాని వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నాయి. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఒక పక్క ఇసుక విషయంలో ఇరకాటంలో పెడుతూనే మరోపక్క రాజధాని వ్యవహారంలో కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు మూకుమ్మడిగా దాడికి దిగుతున్నాయి. కానీ సీఎం జగన్ మాత్రం రాజధానిపై ఇంత రచ్చ జరుగుతున్నా స్పందించిన దాఖలాలు లేవు.

ఎట్టకేలకు జగన్ రాజధానిపై త్వరలో ప్రకటన చేస్తారన్న మంత్రి బొత్సా
ఇక ఇప్పుడు నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికతో రాజధానిపై జగన్ ఒక స్పష్టత ఇస్తారని మంత్రి బొత్సా చెప్తున్నారు. అయితే ఇప్పటకే పలు జిల్లాల్లో పర్యటిస్తున్న నిపుణుల కమిటీ ముందు ఆయా జిల్లాల నుండి రాజధాని తమ ప్రాంతంలో కావాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితే ఉండనుంది . దీంతో నిపుణుల కమిటీ నివేదిక ఏం ఇస్తుంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం . అయితే పాలనా వికేంద్రీకరణ దిశగా వైసీపీ సర్కార్ ఆలోచిస్తున్నట్టు తాజాగా వేస్తున్న అడుగులను బట్టి అర్ధం అవుతున్నా చివరకు ఏపీ సీఎం రాజధానిపై ఏం ప్రకటన చేస్తారో అన్నదే ఇప్పుడు అందరిలో నెలకొన్న ఉత్కంఠ.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!