చంద్రబాబును టార్గెట్ చేసిన మోడీ, మా సహకారంతో పదవులు పొంది.. నిప్పులు చెరిగిన టీడీపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ టెలి కాన్ఫరెన్స్ పైన తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న గురువారం మండిపడ్డారు. విలువలు లేని నాయకులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పారు. తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తిట్టేందుకే టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారని ఆరోపించారు.
కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షులు కాదని, దొంగల ముఠాకు అధ్యక్షులు అని చెప్పారు. చంద్రబాబును తిట్టిస్తూ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కన్నా 420లో టాప్ లిస్టులో ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూడకుండా ప్రధాని మాట్లాడుతున్నారన్నారు.

మా సహకారంతో పదవులు పొంది తిడతారా?
చంద్రబాబును టార్గెట్ చేస్తూ నరేంద్ర మోడీ రాక్షస ఆనందం పొందుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ప్రధానిగా దేశాన్ని పట్టించుకోవడం మానేసిన మోడీ, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతున్నారన్నారు. చంద్రబాబు సహకారంతో పదవులు దక్కించుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని పక్కన పెట్టిన మోడీ ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ, చంద్రబాబును విమర్శించేవారిని అభినందిస్తున్నారన్నారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఆపలేం: హైకోర్టు పచ్చజెండా

మోడీ చూసి నేర్చుకోవాలి
కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందకపోయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం ముందుకు పోతోందని బుద్ధా అన్నారు. ఏపీలో నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూసి నేర్చుకోవాలని మోడీకి హితవు పలికారు. తెలంగాణలో మహాకూటమికి 21 సీట్లు వచ్చాయనీ, బీజేపీకి కేవలం ఒకే సీటు వచ్చిందన్నారు. బీజేపీకి తెలంగాణలో 109 చోట్ల డిపాజిట్ రాలేదన్నారు. దీనిపై మాట్లాడకుండా ఆయన టీడీపీని విమర్శించడం ఏమిటన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ అధినేత జగన్ కుమ్మక్కయ్యారన్నారు.

మోడీ టెలి కాన్ఫరెన్స్
కాగా, బుధవారం ఏపీ బీజేపీ నేతలతో నరేంద్ర మోడీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు మాట్లాడారు. ఏపీ మార్పును కోరుకుంటోందని, తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ మహాకూటమిని ప్రజలు తిరస్కరించబోతున్నారన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, పాలనలో కుంభకోణాలున్నాయన్నారు.
నాడు కాంగ్రెస్‌ను టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించగా, ఇప్పుడు టీడీపీ నేతలు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడంవల్ల తెలంగాణలో ఏమీ జరిగిందో మీ అందరికీ తెలుసనని, ఏపీలోను ఇదే మాదిరిగా జరగబోతుందని, ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా కృషి చేస్తోంది, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా పది జాతీయ సంస్థలను ఏపీలో కేంద్రం ఏర్పాటు చేసిందని, ఏపీలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని, రాష్ట్రానికి తగిన సాయం అందిస్తున్నా చేయడంలేదని చెబుతుండడం తగదని, ఈ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా బూత్ స్థాయి నుంచి ప్రజలకు వివరించాలని సూచించారు.
రెవెన్యూ లోటు, వనరుల కొరతను అధిగమించేందుకు రూ.20వేల కోట్ల వరకు కేంద్రం విడుదల చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందలేదని చెబుతోందని, ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని, వీటికి తగినట్లు వినియోగ ధ్రువపత్రాలు(యూసీ)లు ఎందుకు ఇవ్వలేదని, రాష్ట్ర పాలనలో కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు.