డీజీపీకి బుద్దా వెంకన్న బహిరంగ లేఖ .. ఆ ఎంపీపై చర్యలు తీసుకోండి
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలపై ఇప్పటికే టీడీపీ నేతలు నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. ప్రజలకో న్యాయం మీకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా మరో మారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పార్టీ నేతలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ భౌతిక దూరం పాటించకుండా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనపై డీజీపీకి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్సీ
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసులు ఎంతగానో కష్టబడుతున్నసమయంలో వైసిపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన కార్యక్రమాలు అభ్యంతరకరం అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు . విశాఖ జీవీఎంసీ పరిధిలోని వెల్లంపేటలో కనీస భౌతిక దూరం పాటించకుండా గుంపుగా కార్యక్రమం నిర్వహించారని అలాగే శ్రీకాకుళం జిల్లా కేంద్రం, కోటబొమ్మాళిలో కూడా లాక్ డౌన్ నిబంధనను ఉల్లంఘించారని పేర్కొన్నారు . ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రజలు వెళ్లొద్దని పోలీస్ అధికారులు చెప్పటమే కాదు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపుతున్నారని కానీ ఈ నిబంధనలు వైసీపీ నేతలకు మాత్రం వర్తించటం లేదన్నారు.

టీడీపీ నాయకులైతే కేసులు పెడుతున్నారన్న బుద్దా వెంకన్న
విజయ సాయి రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తిరుగుతున్నా రాజకీయాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నించారు . ఇది లాక్డౌన్ ఉద్దేశ్యాన్ని తుంగలో తొక్కడం కాదా.? ఒక ఎంపీగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా నిబంధనలు గాలికి వదిలి కరోనా వ్యాప్తికి కారణం అవుతూ సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు.? అంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు . నిన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల సహాయం కోసం కారులో నలుగురితో వచ్చినా అరెస్టు చేసి, కేసు పెట్టి, కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అధికార పార్టీ అంటే ఒకలా, ప్రతిపక్ష పార్టీ నాయకులతో ఒకలా ప్రవర్తిస్తున్నారన్నారు.

సోషల్ డిస్టెన్స్ పాటించకుండా విజయసాయి పర్యటనలు .. చర్యలు తీసుకోండి అని విజ్ఞప్తి
విజయ సాయిరెడ్డి చేస్తున్న పనులు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది తెచ్చి పెట్టేలా ఉన్నాయని చెప్పిన బుద్దా వెంకన్న ఇలా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన విజయసాయి రెడ్డిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు బహిరంగ లేఖ రాశారు. ఇక టీడీపీ నేతలపై చూపించే ప్రతాపం విజయ సాయి రెడ్డి బహిరంగంగా వందల మందితో సభలు నిర్వహిస్తే ఎందుకు చూపించలేదు ? చర్యలు తీసుకోలేదు? ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు కారు సీజ్ చేయలేదు? అని డీజీపీనే ప్రశ్నించారు బుద్దా . ఇలాంటి ఘటనలు పునరవృతం కాకుండా విజయ సాయి రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.