వైసీపీ హాయంలో మొదటి సీబీఐ విచారణ... యరపతినేని కేసులపై ఉత్తర్వులు
గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ రావు కేసుల విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉన్న మొత్తం 18 కేసుల విచారణకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలోనే ఆయనపై ఉన్న కేసులకు సంబంధించి హైకోర్టు విచారణ జరిపి హైకోర్టు తీర్పును వెలువరించింది. సీఐడీ విచారణ చూసిన తర్వాత పూర్తి దర్యాప్తు కోసం సీబీఐ విచారణ చేపట్టాలని పేర్కోంది... అయితే సీబీఐ విచారణ చేపట్టలా... వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని.... తీర్పు వెలువరించింది.

సీబీఐకి అప్పగించిన మొదటి కేసు
టీడీపీ నేత, మాజీమంత్రి యరపతినేని శ్రీనివాస రావు మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచెపల్లి మండలాల్లోని మైనింగ్ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించడంతో అందుకు అనుగుణంగా ఆయన కేసును సీబీఐకి అప్పగించాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయనపై ఉన్న అక్రమ మైనింగ్ కేసులను సీబీఐకి అప్పగిస్తూ...ఉత్తర్వులు వెలువరించింది. కాగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే సీఐడి విచారణ చేపట్టింది. అనంతరం ఆ నివేదికపై స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీబీఐకి అప్పగించిన తొలికేసు ఇదే కావడం గమనార్హం.

కోర్టు తీర్పుతో అజ్ఞాతంలోకి వెళ్లిన యరపతినేని
అక్రమ మైనింగ్ నేపథ్యంలో పిడుగురాళ్లకు చెందిన గురవాచారి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో యరపతినేనితో పాటు మరో 12 మందిపై సత్తెనపల్లిలో కేసు నమోదు చేశారు. దీంతో కేసును విచారించిన హైకోర్టు గత ఆగస్టులోనే సీబీఐకి అప్పగించాలని కొరింది. అంతకుముందు జరిపిన సఐడి విచారణపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యరపతినేనికి వ్యతిరేకంగా 20 మందికి పైగా సాక్ష్యం చెప్పినా...యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని అక్రమ మైనింగ్ వ్యవహారంపై గనుల శాఖ అధికారులు సక్రమంగా పని చేయలేదని తేల్చి చెప్పిందని పిటిషనర్ వివరించారు.

సీబీఐకి అప్పగిస్తూ... క్యాబినెట్ నిర్ణయం
కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న మైనింగ్ కేసులపై రాష్ట్ర క్యాబినెట్లో చర్చించారు. ఈ నేపథ్యంలోనే సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.. అయితే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తర్వాత యరపతినేని కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో బయటకు వచ్చారు. కాగా క్యాబినెట్ నిర్ణయం జరిగిన సుమారు మూడు నెలల తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.