చింతమనేని వర్సెస్ కొఠారి .. దేనికైనా రెడీ అంటూ సవాళ్లు.. ప్రతి సవాళ్లు
67 రోజులు జైలు జీవితాన్ని అనుభవించిన తరువాత తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. అన్యాయంగా తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు దళిత వ్యతిరేకి చింతమనేని అని ముద్ర వేసేందుకు స్థానిక వైసిపి నాయకులు కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు చింతమనేని. ఇక చింతమనేని వ్యాఖ్యలపై కొఠారు అబ్బయ్య చౌదరి, ఆయన తండ్రి రామచంద్రరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
టీడీపీ నేత చింతమనేని అరెస్ట్ .. దుగ్గిరాలలో ఉద్రిక్తత

తనపై వైసీపీ నాయకులే తప్పుడు కేసులు పెట్టారన్న చింతమనేని
చింతమనేని వర్సెస్ కొఠారు అబ్బయ్య చౌదరిపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. జైలు నుంచి బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ వైసిపి నాయకులపై, సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అసలు తన మీద కేసులు పెట్టిన వారు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు.కావాలని వైసీపీ నాయకులు, తన సామాజిక వర్గం వారే వెనకుండి టార్గెట్ చేసి తనపై 18 కేసులు బనాయించారని ఆయన పేర్కొన్నారు.

తప్పు చేసినట్టు నిరూపిస్తే ప్రపంచం నుండే నిష్క్రమిస్తానన్న చింతమనేని
తాను తప్పు చేసినట్లు నిరూపణ అయితే శాశ్వతంగా ప్రపంచం నుండి నిష్క్రమిస్తానని,రాజకీయాలకు పనికి రానని ప్రజలు చెప్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చింతమనేని సవాల్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలపై దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.

చింతమనేని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అబ్బయ్య చౌదరి
ఇప్పుడు తన మీద దాడి జరుగుతోందని వ్యాఖ్యలు చేస్తున్న చింతమనేనికి గత ఐదేళ్లలో మీడియాపై చేసిన దాడులు గుర్తుకు రాలేదా అని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దళితులపై దాడులు చేయలేదా..? ఎంత మంది పేదల ఇళ్లు కూల్చారో మారిచిపోయారా .. నీపై అక్రమ కేసులు పెట్టానని అంటున్నావ్ వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అబ్బయ్య చౌదరి.

అక్రమ కేసుల ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేసిన అబ్బయ్య చౌదరి
ఇక అంతే కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పెట్టిన కేసులు ఏవీ లేవని, చింతమనేనిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో నమోదు అయినవేనని పేర్కొన్నారు. ఇక కొఠారి అబ్బయ్య చౌదరి తండ్రి వైసిపి జిల్లా అధికార ప్రతినిధి, రామచంద్రరావు చింతమనేని కి సవాల్ విసిరారు. చింతమనేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన నీకు దమ్ముంటే రా దేనికైనా రెడీ అంటూ వ్యాఖ్యానించారు.

దమ్ముంటే రా.. చూస్కుందాం .. అబ్బయ్య చౌదరి తండ్రి రామచంద్రరావు సవాల్
జనం మధ్యలో చూసుకుందామా.. సింగిల్ గా చూసుకుందామా అంటూ ప్రశ్నించారు. సంక్రాంతి పోటీల్లో నువ్వు, నేను మల్లయుద్ధం చేద్దాం రమ్మన్నారు. సాము గారిడీ చేద్దామని సవాల్ చేశారు. నేను అయ్యప్ప మాల తీసి వస్తా ఎప్పుడు కబురు చేసినా సిద్ధంగా ఉంటా అంటూ రామచంద్రరావు చింతమనేనికి చాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన తండ్రి రామచంద్రరావు చేసిన తాజా వ్యాఖ్యలతో దెందులూరు రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇక ఈ నేపథ్యంలో చింతమనేని ఏ విధంగా స్పందిస్తారు. అధికార పార్టీ నేతల సవాల్ కు సమాధానం ఏం చెప్తారు అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!