ఆరోగ్యశ్రీకి ప్రత్యేకాధికారి..సీఎం పర్యవేక్షణ: తండ్రి బాటలోనే.. సీఎంఓలో అధికారుకు బాధ్యతలు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పేషీలో అధికారులకు శాఖలు కేటాయించారు. ఏరీ కోరి ఎంపిక చేసుకున్న తన టీంలో తన ముఖ్య సలహాదారుడుతో పాటుగా అందరికీ శాఖలను విభజించారు. అందులో తన తండ్రి వైయస్సార్ మానస పుత్రిక అయిన ఆరోగ్యశ్రీకి జగన్ సైతం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కోసం వృత్తి రీత్యా వైద్యుడు అయిన జగన్ కుటుంబ సన్నహితుడైన హరికృష్ణకు అప్పగించారు. ఇక, అధికారులకు గతంలో అనుభవం ఉన్న శాఖల వారీగా ఇప్పుడు సైతం ప్రాధాన్యతలను స్పష్టం చేసి..వారికి శాఖల కేటాయింపు పూర్తి చేసారు.
సీఎం జగన్ పీషీ అధికారులకు బాధ్యతలు..
అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు:
సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు.
పీవీ రమేష్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ:
వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్‌ఫ్రా, ఇంధన శాఖ.

సొల్మన్ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి:
ట్రాన్స్‌పోర్ట్ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు.
కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి:
నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, సీఆర్‌డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం.
జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి:
పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి.
ఆరోగ్య శ్రీ బాధ్యతలు హరికృష్ణకు...
తొలి నుండి వైయస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే డాక్టర్ ముక్తాపురం హరికృష్ణకు ముఖ్యమంత్రి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. షర్మిళ పాదయాత్రలో హరికృష్ణ పూర్తిగా అనుసరించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ సేవలు అందించారు. వృతి రీత్యా వైద్యుడు కావటంతో ఆయనకు తన పేషీలో కీలక బాధ్యతలను జగన్ కేటాయించారు. డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ ప్రస్తుతం సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఆయనకు ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు) బాధ్యతలు చూడాలని జగన్ ఆదేశించారు. గతంలో వైయస్సార్ హాయంలోనూ ఇదే విధంగా ఆరోగ్య శ్రీ కోసం ప్రత్యేక అధికారిని కేటాయించారు. ఇప్పుడు జగన్ సైతం ఆరోగ్యశ్రీ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలనే నిర్ణయంతో హరికృష్ణకు ఈ బాధ్యతలను అప్పగించారు. వీటిని సీఎం హోదాలో జగన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.
జగన్ బాధ్యతలు ఆ ఇద్దరికీ..
ముఖ్యమంత్రిగా జగన్ కు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్‌లు..అపాయింట్‌మెంట్ల నిర్వహణ..విజిటర్లకు సమయం కేటాయింపు వంటి అంశాలను ఎప్పటి నుండో జగన్ వద్దే ఉంటున్న పి కృష్ణ మోహన్‌రెడ్డికి కేటాయించారు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రికి ఓఎస్‌డీగా పని చేస్తున్నారు. పి.కృష్ణమోహన్‌రెడ్డి,
ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ):
ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అపాయింట్‌మెంట్స్, విజిటర్స్ అపాయింట్‌మెంట్స్ బాధ్యతను ఆయనకే అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కేబినెట్ ఏర్పాటు..అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు శాఖల కేటాయింపు..కొత్త ప్రభత్వం లాంఛనగా పూర్తి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయటంతో ఇక..పాలనా పరంగా పూర్తిగా జగన్ దృష్టి పెట్టనున్నారు.