జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం.. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం వైఎస్ జగన్ మరో ముందడుగు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు . మహిళలు ఆర్థిక స్వావలంబన సాగించే దిశగా ప్రభుత్వ సహకారాన్ని అందించడం కోసం, మహిళల జీవన స్థాయిని ప్రమాణాలను పెంచడం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని ప్రారంభించిన జగన్ మహిళల మెరుగైన జీవనోపాధి, సుస్థిర ఆదాయమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు.
వైఎస్ జగన్ సొంత ఊళ్లోనే దారుణం .. దళితమహిళ హత్యాచారం : లోకేష్ , దివ్యవాణి, దేవినేని ఉమా ఫైర్

జగనన్న జీవ క్రాంతి .. పాదయాత్ర సమయంలో హామీ నెరవేర్చిన జగన్
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆ సమస్యలకు స్పందనగా పలు కార్యక్రమాలను అమలు చేయాలని భావించారు. నాడు పాదయాత్రలో ప్రజలకు హామీలను కూడా ఇచ్చారు. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్ని అవాంతరాలు వస్తున్నప్పటికీ హామీలను నెరవేరుస్తూనే ఉన్నారు .అందులో భాగంగా నేడు జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించి ఇచ్చిన హామీని నెరవేర్చానని గుర్తుచేశారు.

45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళలకు గొర్రెలు , మేకల యూనిట్లు పంపిణీ
జగనన్న జీవ క్రాంతి పథకంలో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు గల బీసీ ,ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు, ప్రభుత్వ ఆర్థిక సహాయం తో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేస్తారు. 2.49 లక్షల గొర్రెల, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లు వ్యయం చేయనున్నారని తెలుస్తుంది . అంతే కాదు ఈ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయనున్నట్లుగా సమాచారం.

వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించటం కోసమే అన్న సీఎం
మొదటి విడతలో మార్చి 2021 వరకు 20 వేల యూనిట్లను, రెండవ విడతలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు లక్ష 30 వేల యూనిట్లను, మూడవ విడతలో సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు 99 వేల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం జగన్ పేర్కొన్నారు . రైతుల్లో మరింత ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తమ వంతు సహకారాన్ని ఎప్పుడూ అందిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా ఆర్థిక స్వావలంబన
ఇక పశువుల సంరక్షణ బాధ్యత రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉంటుందని, వాటికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటుగా , పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక వనరులు పెరగాలని ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా 5400 కోట్ల రూపాయలు అందించామని చెప్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో కూడా పశువుల పెంపకంపై శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి , శిక్షణ ఇస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. మహిళలు జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా ఆర్థిక స్వావలంబన సాగించాలని సీఎం జగన్ కోరారు.