గొల్లపూడిలో దేవినేని ఉమా అరెస్ట్ .. టీడీపీ, వైసీపీ కార్యకర్తల నినాదాలతో తీవ్ర ఉద్రిక్తత, దీక్షకు నో పర్మిషన్
దేవినేని ఉమా పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమ , ఎక్కడైతే కొడాలి నాని తన పై తీవ్ర వ్యాఖ్యలు చేశారో అక్కడ ఆయనకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు .అందులో భాగంగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తానని, కొడాలి నాని వచ్చి టచ్ చేసి చూడాలి అని సవాల్ విసిరారు. అయితే దేవినేని ఉమా చేస్తానని చెప్పిన దీక్షకు అనుమతి లేని కారణంగా పోలీసులు దేవినేని ఉమ ను అరెస్ట్ చేశారు.

గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా .. టచ్ చేసి చూడు .. కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్

గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమైన దేవినేని ఉమా
కృష్ణా జిల్లా రాజకీయాలు దేవినేని ఉమ, కొడాలి నాని మాటల యుద్ధంతో కాక రేపుతున్నాయి. కొడాలి నాని దేవినేని ఉమ ను ఇంటికి వెళ్ళమని బడిత పూజ చేస్తామని వ్యాఖ్యలు చేయడంతో, దానిపై సీరియస్ గా స్పందించిన దేవినేని ఉమా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా నువ్వు వస్తావా లేక సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారో తేల్చుకోండి వచ్చి టచ్ చేసి చూడండి అంటూ సవాల్ విసిరారు. చిల్లర మాటలు మాట్లాడే నువ్వు అసలు మంత్రి వేనా అంటూ ప్రశ్నించారు. పేకాట ఆడిస్తూ అడ్డంగా దొరికిపోయిన నువ్వు గొల్లపూడి వచ్చి పిచ్చివాగుడు వాగుతావా అని ప్రశ్నించారు .

కరోనా నిబంధనల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు
చంపుతా, పొడుస్తా, బడిత పూజ చేస్తామంటూ చిల్లర వ్యాఖ్యలు చేస్తావా అని కొడాలి నానీపై మండిపడ్డారు. గొల్లపూడి వస్తాను నువ్వు కూడా రా దమ్ముంటే తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.
దేవినేని ప్రకటన నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు అటు గొల్లపూడి లోనూ, ఇటు దేవినేని ఉమ ఇంటి వద్ద భారీగా మోహరించారు. కరోనా నిబంధనల కారణంగా దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు .గొల్లపూడి లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షలు చేపట్టడానికి సిద్ధమైన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ని పోలీసులు అరెస్ట్ చేశారు.
గొల్లపూడికి చేరుకున్న దేవినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు .. ఉద్రిక్తత
దీక్ష చేస్తానని చెప్పి గొల్లపూడి చేరుకున్న దేవినేని ఉమా ను ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాగానే పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటికే భారీగా మోహరించిన టీడీపీ శ్రేణులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది . భారీగా మోహరించిన పోలీసులు దేవినేని ఉమా ను అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో అక్కడినుండి తరలించారు.

వైసీపీ , టీడీపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తంగా గొల్లపూడి
పోటాపోటీగా టిడిపి నేతలు, వైసీపీ నేతలు నినాదాలు చేశారు. మంత్రి కొడాలి నాని సైతం దేవినేని ఉమా చేసిన సవాల్ కు సిద్ధమని ప్రకటించడంతో దేవినేని ఉమ ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. జగన్ డౌన్ డౌన్ అంటూ టిడిపి కార్యకర్తలు, దేవినేని ఉమా డౌన్ డౌన్ అంటూ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు .