దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్ .. మొరటోడికి మొగలిపువ్వు ఇచ్చినట్టుగా కొడాలి నానీకి మంత్రి పదవి
ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై, అలాగే టిడిపి నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి కొడాలి నానికి టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని తన పద్ధతి మార్చుకోవాలని దివ్యవాణి వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం రాజకీయం కాదు అని మండిపడ్డారు. కొడాలి నాని పనితీరు, మాటలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నాయి అని ఆమె ప్రశ్నించారు.

రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అయినట్లుగా నానీ తీరు
కొడాలి నానీని చూస్తుంటే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అయినట్లుగా ఉందని దివ్యవాణి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పై నాని చేసిన విమర్శలపై మండిపడిన దివ్యవాణి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని నానీ చెబుతున్నారని, ఆనాడు జరిగిన పరిణామాలకు నానీ తానే స్క్రిప్టు రాశారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో ? సూట్ కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఖర్జూర నాయుడు గారి కుటుంబం రౌడీయిజం ,ఫ్యాక్షనిజం తో పైకి రాలేదని ఆమె పేర్కొన్నారు.

చావుల గురించి మాట్లాడటానికి నాని ఏమైనా యమధర్మరాజుకు శిష్యుడా ?
చంద్రబాబు గురించి ఒక పేపర్లో చులకనగా రాశారని, గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని దివ్యవాణి గుర్తు చేశారు. నానికి చంద్రబాబుపై ఎంత ద్వేషం ఉందో ఆయన మాటలతోనే అర్థమవుతుందని దివ్యవాణి పేర్కొన్నారు. చంద్రబాబు వయసు గురించి చావుల గురించి మాట్లాడటానికి నాని ఏమైనా యమధర్మరాజుకు శిష్యుడా అంటూ ప్రశ్నించారు. కరోనా ప్రభావం తెలిసుంటే ఆయన చంద్రబాబు వేషధారణ గురించి మాట్లాడే వారు కాదని పేర్కొన్నారు . కొడాలి నాని చంద్రబాబు స్థాయి తెలుసుకుని మాట్లాడాలని చంద్రన్నది నిజంగా చంద్రమండలం స్థాయే అని దివ్యవాణి తెలిపారు.

ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తారా ?
ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా చంద్రబాబుతో సమానంగా పని చేయగలరా అంటూ ప్రశ్నించారు దివ్యవాణి. కొడాలి నాని లాంటి వాళ్లు చంద్రబాబుపై ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను ఏమీ చెయ్యలేరు అంటూ వ్యాఖ్యానించారు. లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు మంత్రి స్థాయిలో ఉండి చేయడం బాధాకరమని దివ్యవాణి పేర్కొన్నారు. లక్ష కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారో చెప్పకుండా ప్రశ్నించిన వారిని చంపేస్తామని బెదిరిస్తారాఅంటూ ఫైర్ అయ్యారు దివ్యవాణి.

జగన్ పార్టీ నాయకులకు సభ్యత , సంస్కారం నేర్పితే బాగుంటుంది
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును కోర్టులకు , కేసుల కోసం అనవసరంగా ఖర్చు చేస్తున్నారని కనీసం ఆ డబ్బులను ఖర్చు చేసి వైసీపీ నాయకులకు సభ్యత, సంస్కారం నేర్పిస్తే బాగుంటుందని దివ్యవాణి హితవుపలికారు. కొడాలి నానికి మంత్రి పదవి మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చిన చందంగా ఉందని దివ్యవాణి ఎద్దేవా చేశారు
. కొడాలి నానీ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని, భాష మార్చాలని దివ్యవాణి నానీని ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు .