ప్రతిపక్షాలు చేసిన పనితో .. పోలీసులకు సవాల్ గా దుర్గ గుడి వెండి సింహాల మాయం కేసు !!
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు రథం సందర్శన, తీవ్ర వ్యాఖ్యలతో పలు నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యటం , ఆ తర్వాత జరుగుతున్న విచారణ తెలిసిందే . అయితే వెండి రథం మూడు సింహాల మాయం కేసు ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది . కీలక ఆధారాలు సేకరించటం పోలీసులకు కష్టంగా మారింది.
దుర్గగుడి వెండిరథం సింహాలు మాయం ఘటన.. ప్రతిపక్షాలు ఫైర్, విచారణ కమిటీ వేస్తామన్న మంత్రి

వెండి రథాన్ని సందర్శించిన రాజకీయ పార్టీలు .. పోలీసుల విచారణకు ఇదే ఇబ్బంది
తాజాగా అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో ఒకటి మాత్రమే మిగిలి ఉండటం, ఇక ఆ విషయాన్ని ఇటీవల ఆలయాలలోని రథాలకు భద్రత కల్పించే సమయంలో గుర్తించటం తెలిసిందే . దీనిపై ఏపీలో పెద్ద రగడ కొనసాగింది. అంతకు ముందే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కావటం , ఆతర్వాత దుర్గ గుడిలో మూడు వెండి సింహాలు మాయం కావటంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీల నేతలు అమ్మవారి వెండి రథాన్ని పరిశీలించారు .ఇప్పుడు ఈ పరిణామాలే పోలీసుల విచారణకు ఇబ్బంది తెచ్చి పెట్టాయి .

రాజకీయ నేతలు చేసిన పనికి పోలీసులకు కష్టంగా మారిన వేలిముద్రలు సేకరణ
ఉత్సవ సమయంలో మాత్రమే రధాన్ని బయటకు తీస్తామని, మిగతా ఈ సమయంలో రథం ఆలయం లోపలే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత 18 నెలలుగా రథాన్ని బయటకి తీయలేదని, ఈ సంవత్సరం కరోనా కారణంగా ఉగాదికి రథోత్సవం జరగలేదని పేర్కొన్నారు. అయితే రథం లోని మూడు వెండి సింహాలు మాయం ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక రాజకీయ పార్టీల నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే ముందే రథాన్ని సందర్శించారు. రథంలో వెండి సింహాలు మాయమైన ప్రాంతాల్లో చేతులతో ముట్టుకున్నా రు.

డాగ్ స్క్వాడ్ తోనూ నిందితులను పసిగట్టలేని స్థితి ... పోలీసులకు తలనొప్పిగా క్లూస్ సేకరణ
ఇప్పుడు వెండి సింహాలు మాయమైన రథ ప్రదేశంలో వేలిముద్రల సేకరణ ఇబ్బందిగా మారుతుంది. రథాన్ని సందర్శించి ఆయా భాగాలలో చేతులు వేసిన రాజకీయ పార్టీల నేతల వేలిముద్రలు ఉండడంతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఇక డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేద్దామన్నా చాలామంది రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వచ్చి వెళ్లడంతో అది సాధ్యం కాని పరిస్థితి ఉంది. ఆలయ అప్రైజల్ సమీ , ఏఈవో రమేష్ లను పోలీసులు ఇప్పటికే విచారణ జరిపారు.

ఘటన ఎప్పుడు జరిగిందో ? .. ఆధారాలు లేకుండా .. విచారణ సాగేదెలా
మరి కొందరు ఉద్యోగులు ,ఆలయ సెక్యూరిటీని కూడా పోలీసులు విచారించనున్నారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంలో జాప్యం జరగడం , ఫిర్యాదు కంటే ముందే చాలామంది రథం ప్రాంతాన్ని సందర్శించడం తో సంఘటనా స్థలంలో క్లూస్ సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఎప్పుడు జరిగిందో అర్థం కాని మూడు సింహాల మాయం ఘటనలో కేసును ముందుకు నడిపించడానికి కావలసిన ఆధారాలు లభించకపోవడంతో, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.