andhra pradesh vijayawada corporation AP Municipal Elections 2021 vallabhaneni vamsi ysrcp votes tdp విజయవాడ వల్లభనేని వంశీ వైఎస్సార్సీపీ ఓట్లు టీడీపీ politics
ఆసక్తికరంగా విజయవాడ కార్పోరేషన్ పోరు- వంశీని రంగంలోకి దింపిన జగన్- టార్గెట్ వారే
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోరులో విజయవాడ కార్పోరేషన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైసీపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఈ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అయితే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే పంచాయతీ పోరులో సత్తా చాటుకున్న వైసీపీ ఇప్పుడు మున్సిపల్ పోరులోనూ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి కీలకంగా మారిపోయారు.

విజయవాడ కార్పోరేషన్ పోరు
విజయవాడ కార్పోరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నాయి. అయితే అధికార పార్టీగా ఉన్న అనుకూలతలతో పాటు భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలు వైసీపీ విజయానికి రాచబాటలు వేస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో జనం వైసీపీ ప్రభుత్వం నుంచి ఏదో విధంగా లబ్ది పొందిన వారే కావడం ఇక్కడ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపే అంశంగా మారింది. దీంతో వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ చెమటోడ్చక తప్పని పరిస్ధితి. జనసేన ప్రభావం నామమాత్రంగా మారింది.

బెజవాడలో చక్రం తిప్పుతున్న వంశీ
విజయవాడ వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా సిటీ మొత్తాన్ని కవర్ చేసే నేతలు మాత్రం కరువయ్యారు. పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుతో పాటు గౌతం రెడ్డి, అవినాష్, ఇతర నేతలు కూడా తమ ప్రాంతాలకే పరిమితం అయ్యే పరిస్ధితి. దీంతో నగరంలో ప్రభావం చూపగల వర్గాలను వైసీపీకి అనుకూలంగా మలిచేందుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలకంగా మారిపోయారు. తాజాగా అధిష్టానం ఆయన్ను విజయవాడలో వైసీపీ గెలుపు బాధ్యతలు అప్పగించడంతో ఇప్పుడు వంశీ ప్రచారంతో పాటు ఇతర వ్యవహారాల్లోనూ కీలకంగా కనిపిస్తున్నారు.

వంశీకి అప్పగించిన బాధ్యత ఇదే
ప్రస్తుతం విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రభావం చూపగలిన వర్గాల్లో కమ్మ సామాజిక వర్గంతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలు ఉన్నారు. వీరిని వైసీపీవైపు మళ్లించేందుకు నగరంలో వైసీపీ ప్రజాప్రతినిధుల స్టామినా సరిపోదు. దీంతో వ్యాపార వర్గాలతో పాటు కమ్మ సామాజిక వర్గంతోనూ సత్సంబంధాలు కలిగిన వల్లభనేని వంశీ వైసీపీకి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. దీంతో సీఎం జగన్ ఆయన్ను చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా రంగంలోకి దింపారు. గతంలో టీడీపీ తరఫున పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు నగరంలోని ఆయా వర్గాలతో వంశీకి ఉన్న సంబంధాలు ఇప్పుడు వైసీపీకి పనికొస్తున్నాయి. దీంతో ఆయన ఇతర పార్టీల వారిని వైసీపీవైపు మళ్లించడంతో పాటు ఈ ఎన్నికల్లో మద్దతిచ్చేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు.

పశ్చిమలో వైసీపీకి కలిసొస్తున్న వంశీ అనుభవం
పశ్చిమ నియోజకవర్గంలో అయితే వంశీ నేరుగా ప్రచార బరిలోకి కూడా దిగుతున్నారు. కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో తనకున్న సంబంధాలను వాడుకుంటూ వైసీపీకి ఈ ఎన్నికల్లో సహకరిస్తే ప్రభుత్వం తరఫున అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు నగర అభివృద్ధికి బాటలు వేయొచ్చని చెప్తున్నారు. దీంతో గతంలో టీడీపీ తరపున పనిచేసిన శ్రేణులు కూడా ఇప్పుడు వైసీపీకి ఇక్కడ సహకరిస్తున్నాయి. దీంతో విజయవాడలో తూర్పు, మధ్య నియోజకవర్గాలతో పోలిస్తే వైసీపీకి ఇక్కడ పూర్తిగా అనుకూలమైన పరిస్ధితి కనిపిస్తోంది. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 22 డివిజన్లలో వైసీపీ 16 డివిజన్ల వరకూ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.